top of page

శ్రీశైల బ్రహ్మోత్సవాలు

సమస్త భూమండలానికి నాభి స్థానం వంటిది శ్రీశైల మహాక్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మల్లికార్జునుడికి, అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబకు నిలయం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా, శ్రీశైల స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వీటిని ఏటా రెండుసార్లు నిర్వర్తించడం పరిపాటి. ఈ సారి మంగళవారం మొదలయ్యే ఉత్సవాలు శివరాత్రి వరకు కొనసాగి, మరునాడు రథోత్సవంతో ముగుస్తాయి.

మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని సంక్రాంతికి, శివరాత్రితో పరిసమాప్తమయ్యేలా రెండోసారి శ్రీమహాలింగ చక్రవర్తికి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. క్షేత్రపాలకుడైన వీరభద్రుడి పర్యవేక్షణలో, చండీశ్వరుడి కనుసన్నల్లో, బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో సాగే సంప్రదాయ ఉత్సవాలివి. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్ని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్ని నవాహ్నిక దీక్షతో పదకొండు రోజులు ఆచరిస్తారు. మొదటి రోజున స్థానాచార్యులు, అర్చక స్వాములు, వేదపండితులు యాగశాలలోకి ప్రవేశించగానే గణపతి పూజ, పుణ్యాహవాచనం మొదలవుతాయి. స్థానాచార్యుల సంకల్పం తరవాత చండీశ్వర ఆరాధన, కంకణ పూజ జరుగుతాయి.

రుత్విక్కులకు దీక్షావస్త్రాలు అందజేస్తారు. అఖండ దీపారాధన, హోమాల అనంతరం రుద్ర కలశ స్థాపన ఉంటుంది. తొలిరోజు సాయంత్రం అంకురార్పణగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని సేకరిస్తారు. తొమ్మిది మూకుళ్లలో ఉంచి- నవ ధాన్యాల్ని నీళ్లతో కలిపి చల్లుతారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. బ్రహ్మోత్సవాలు ముగిసేలోగా, ఈ నవధాన్యాలు మొలకలెత్తుతాయి.

బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ అత్యంత ప్రధానమైనది. ఆ స్తంభం పైన పతాకాన్ని ఆవిష్కరిస్తారు. నూత్న వస్త్రం పైన నందీశ్వరుణ్ని, అష్టమంగళ చిత్రాల్ని రూపొందిస్తారు. నందిధ్వజ పటం పేరిట ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ‘భేరీ పూజ’ అంటూ డోలును పూజిస్తారు. సకల దేవతల్నీ ఆహ్వానించి, నిర్ణీత స్థలాల్ని కేటాయించి, రోజూ నివేదనల్ని సమర్పిస్తారు.

లోక కల్యాణార్థం భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామికి రెండో రోజున వాహన సేవలు జరుగుతాయి. దేవీ దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాల్ని హంస, మయూర, గజ, అశ్వ వాహనాలపైన మాడవీధుల్లో ఊరేగిస్తారు. రోజుకో వాహనం ఊరేగింపు నిర్వహిస్తారు. వివిధ పుష్పాలు, ఆభరణాలతో అలంకరిస్తారు. పూజాదినాలతో పాటు గ్రామోత్సవం జరుపుతారు.

మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం భూకైలాసంలా పరమ శోభాయమానంగా గోచరిస్తుంది. ఆనాటి రాత్రి పదకొండుమంది వేదపండితులతో మహా రుద్రాభిషేకం జరుగుతుంది. శ్రీశైలంలో మాత్రమే జరిగే పాగాలంకరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. స్వామివారి గర్భాలయం, విమాన శిఖరం నుంచి ముఖమండపం పైన ఉండే నందుల్ని అనుసంధానిస్తూ వస్త్రాలంకరణ ఉంటుంది. ఈ పాగాను సమర్పించే భక్తులు రోజుకు ఓ మూర వంతున, ఏడాదిపాటు 365 మూరల పొడవు గల తలపాగాల్ని నేస్తారు. బ్రహ్మోత్సవ కల్యాణానికి ముందు పెళ్లికుమారుడికి ఈ పాగాలంకరణ చేస్తారు. పాగాలంకరణ అనంతరం, బ్రహ్మోత్సవ కల్యాణాన్ని ఉత్తర దిశలోని చంద్రావతి మండపంలో నిర్వహిస్తారు. వధూవరులకు ప్రభుత్వంతో పాటు తిరుమల-తిరుపతి దేవస్థానంవారు పట్టువస్త్రాలు తెచ్చి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

తొమ్మిదో రోజు సాయంకాలం సదస్యం, నాగవల్లి జరుగుతాయి. పదో రోజున యాగపూర్ణాహుతి, వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూలస్నానం ఉంటాయి. చండీశ్వరుడికి పుణ్యస్నానం చేయిస్తారు. ధ్వజస్తంభం మీది నంది పతాకాన్ని అవరోహణ చేస్తారు. దీనితో సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లవుతుంది. బ్రహ్మోత్సవాల చివరి రోజున దంపతులకు పుష్పోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవం వేడుకలు జరుపుతారు. మొత్తం 18 రకాల పుష్పాలతో పుష్పోత్సవం చేస్తారు. ఈ ఉత్సవాలకు ఏటా లక్షలాది భక్తులు హాజరవుతుంటారు..

ఓం నమః శివాయ….🌹🙏🙏🙏🙏

1 view0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page