శ్రీమద్రామాయణం – బాలకాండ – 55,56,57వ సర్గ –
*శ్రీమద్రామాయణం* *బాలకాండ – 55వ సర్గ* ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసెయ్యాలి. అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తప్పించాలంటే అతనితో ఉన్న శత్రుఘ్నుడిని కూడా తప్పించాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటే రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు. అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరుగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు. కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు. *ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |* *ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాంజలిః ||* ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నం కోసం రోజూ కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి” అని మంథర కైకేయతో అన్నది. మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో “నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు” అని అడిగింది. అప్పుడు మంథర … *అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం |* *యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||* “ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దతు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పదునాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వరాలని అడుగు” అని చెప్పింది.
శ్రీమద్రామాయణం బాలకాండ – 56వ సర్గ “మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది” అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర “నీకు ఇంత చిన్న విషయం తెలియదా? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంతి నగరంలో తిమిధ్వజుడు (శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళీ దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళీ వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కానీ అప్పుడు నువ్వు ఏమీ కోరికలు లేవని అడగలేదు. అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో. ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా? ఇప్పుడు సమయం వచ్చింది. ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు” అని చెప్పింది. ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో “ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తాను. బంగారపు బొట్టు చేయిస్తాను. రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి” అన్నది. అప్పుడా మంథర “నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో. అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు. మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇవ్వమని నిలదియ్యి” అని అన్నది. వెంటనే కైకేయి తన అలంకారాలన్నీ తీసేసి కోప గృహం లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటూ “మంధరా! ఇక ఈ మందిరం నుండి నవ్వుతూ బయటకు వస్తున్న కైక నో, లేక కైక శవాన్నో నువ్వు చూస్తావు” అని చెప్పి వెంటనే తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి పడుకుంది. దశరథుడు పట్టాభిషేకానికి కావలసిన ఏర్పాట్లు పనులను పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవారు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయ ఎక్కడా కనపడలేదు. కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందని చెప్పింది. వికలమైన మనస్సుతో దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. సతతం సర్వాభరణాలతో కళ కళ లాడుతూ ఉండే కైకేయి ఒంటిమీద మంచి వస్త్రం కూడా లేకుండా పడిఉండడం చూసి చాలా బాధ పడ్డాడు. శ్రీమద్రామాయణం – బాలకాండ – 56వ సర్గ – సంపూర్ణం
*శ్రీమద్రామాయణం* *బాలకాండ – 57వ సర్గ* అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు “కైకా! నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. వాళ్ళందరిని పిలిపిస్తాను. నువ్వు అలా పడిఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు తప్పక తీరుస్తాను. *[అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం |* *దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః ||]* ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైకా. నీ కోరిక ఏమిటో చెప్పు. దాన్ని తప్పకుండా తీరుస్తాను” అన్నాడు. “నా కోరిక ఏమిటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేమిటని అంటావు. కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేమిటో చెప్తాను” అని కైకేయ అన్నది. అప్పుడు దశరథుడు “ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైకా! నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను” అన్నాడు. అప్పుడా కైక “రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా! పగటి దేవతలారా! గృహ దేవతలారా! సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షులుగా ఉన్నారు. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా! జ్ఞాపకం తెచ్చుకో. ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము కదా, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను. *[అభిషేకసమారంభో రాఘవస్యోపకల్పితః |* *అనేనైవాభిషేకేణ భరతో మేభిషిచ్యతాం |* *నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |* *చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |* *భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం |]* “ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది మీద అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, శాకాహారిగా తపస్వి లాగ బతకాలి” అని అన్నది. *శ్రీమద్రామాయణం – బాలకాండ – 57వ సర్గ – సంపూర్ణం*