శ్రీమద్రామాయణం – బాలకాండ – 52,53,54వ సర్గ
*శ్రీమద్రామాయణం* *అయోధ్యకాండ – 52వ సర్గ* సుమంత్రుడు రామచంద్రమూర్తిని ఆ సభకి తీసుకువచ్చాడు. అప్పుడు రాముడు నేను రామవర్మని వచ్చాను అని చెప్పి చెవులు పట్టుకుని తన శిరస్సు దశరథుడి పాదాలకి తగిలేటట్టు నమస్కారం చేశాడు. రాముడికి ఉన్న గుణములని చూసిన దశరథుడికి అద్దంలో తనని తాను చూచుకొన్నట్లు ఉంది. అప్పుడు దశరథుడు “రామా! నా యొక్క శీలమును తెలుసుకున్న, గొప్ప ధర్మము కలిగిన, నిరంతరమూ నన్ను అనువర్తించేది అయిన నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి కనుక, అలాగే నీకు గొప్ప గుణములు ఉన్నాయి కనుక నీకు పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను. నీకు తెలిసినవే అయినా కొన్ని విషయాలను నీకు చెప్తాను విను. నువ్వు రాజువయ్యాక రెండు వ్యసనాలు వస్తాయి. అవి మనలను నాశనం చేస్తాయి. కావున వాటిని చేరనీకుండా చూసుకో. ఆ రెండు వ్యసనాలే కామము మరియు క్రోధము. (కామము వలన నిష్కారణంగా వేటాడాలన్న బుద్ధి పుడుతుంది. జూదమాడదామన్న బుద్ధి పుడుతుంది. పగటి పూట నిద్రపోవాలన్న అలవాటు వస్తుంది. పరదూషణములను వేరొకరి వద్ద కూర్చుని వినాలనిపిస్తుంది. పగటి పూట అని చూడకుండా స్త్రీతో సంభోగిద్దామనిపిస్తుంది. మద్యం తాగాలనిపిస్తుంది. పగటి పూట నృత్యము చూడాలనిపిస్తుంది. గీతములను విందామనిపిస్తుంది. అలాగే క్రోధము వలన చాడీలు చెప్పాలనిపిస్తుంది. సత్పురుషులని నిర్బంధించాలనిపిస్తుంది. కపటముగా వేరొకరిని చంపాలనిపిస్తుంది. ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం వస్తుంది. ఇతరులలోని గుణాలని దోషాలుగా మలిచి చెప్పాలనిపిస్తుంది. ఇతరుల ధనాన్ని అపహరించాలనిపిస్తుంది. అవతలివారి మనస్సు బాధ పడేటట్టు మాట్లాడాలనిపిస్తుంది. చేతిలో ఒక ఆయుధం పట్టుకొని అవతలవాడిని నిష్కారణంగా శిక్షించాలనిపిస్తుంది.) రామా! నీకు పుష్యమి నక్షత్రంలో పట్టాభిషేకం చేస్తాను. కావున ఈ రోజుకి వెళ్ళి ఉపవాసం చెయ్యి” అన్నాడు దశరథుడు. అందరూ వెళ్ళిపోయాక దశరథుడు కూడా వెళ్ళిపోయాడు. అంతఃపురానికి వెళ్ళాక దశరథుడు సుమంత్రుడిని పిలిచి రాముడిని మళ్ళీ తీసుకురమ్మన్నాడు. రాముడు వచ్చాక దశరథుడు ఇలా అన్నాడు “నేను జీవితంలో అనుభవించని సుఖం లేదు. ఈ శరీరానికి వృద్ధాప్యం వచ్చింది. ఎన్నో యజ్ఞాలు చేశాను. పితృ ఋణం, దేవతా ఋణం, ఋషి ఋణం ఇలా అన్ని ఋణాలు తీర్చుకున్నాను. నేను చెయ్యవలసిన పని ఏదన్నా ఉంటే అది నీ పట్టాభిషేకమే. మీరు ఎందుకింత తొందర పడుతున్నారు అని అడుగుతావేమో! నాకు తరచూ పీడకలలు వస్తున్నాయి. ఆకాశం నుండి ఉల్కలు పడుతున్నాయి. ఈ శరీరం పడిపోతుందని నేను బెంగపడడంలేదు. ప్రజలు దిక్కులేనివారు కాకూడదు. అందుకని నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను. నీకు పట్టాభిషేకం చెయ్యాలని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన మారిపోకముందే చేసెయ్యడానికి తొందరపడుతున్నాను. భరతుడు చాలా మంచివాడు. ఇప్పుడు తన మేనమామ అయినా యుధాజిత్ వద్ద ఉన్నాడు. భరతుడు రాక ముందే నీకు పట్టాభిషేకం చేసేస్తాను. ఒక మంచి పని మొదలుపెట్టగానే విఘ్నాలు వస్తాయి. నీ స్నేహితులందరినీ అప్రమత్తంగా ఉండమను. సీతమ్మతో కలిసి దేవతలని ప్రార్ధించి, దర్భల(గడ్డి) మీద పడుకో” అని చెప్పి పంపించాడు. శ్రీమద్రామాయణం – బాలకాండ – 52వ సర్గ – సంపూర్ణం
*శ్రీమద్రామాయణం* *బాలకాండ – 53వ సర్గ* దశరథుడు సుమిత్రని చేసుకున్నా పిల్లలు పుట్టలేదు కాబట్టి, యవ్వనంలో ఉన్న, సౌందర్యరాశి, అన్ని విద్యలు తెలిసిన కైకేయని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో కైకేయ రాజు, నా కూతురికి నీకు పిల్లలు పుడితే వాళ్ళకే పట్టాభిషేకం చెయ్యాలని అడిగాడు. దశరథుడు అప్పుడు మాట ఇచ్చాడు. అందుకని ఇప్పుడు కైకేయ రాజుని పిలవకుండానే రాముడికి తొందరగా పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నాడు. రాముడు అంతఃపురానికి వెళ్ళి తన తల్లి అయిన కౌసల్యా దేవితో తన పట్టాభిషేకం గురించి చెప్పగా, ఆవిడ చాలా సంతోషపడింది. సీతమ్మ, లక్ష్మణుడు ఎంతో ఆనందపడ్డారు. తన మిత్రులకి కూడా చెప్పాడు లక్ష్మణుడు. తరువాత రాముడు దేవతలకి హవిస్సులు ఇచ్చి, మిగిలిన హవిస్సుని తిన్నాడు (ఉపవాసం అంటే, కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి, కన్ను పడిపోనంత సాధ్విక ఆహరం, శరీరం నిలబడడానికి కావలసినంత తిని, ఆ ఓపికతో భగవతారాధన చెయ్యడం ఉపవాసం, అన్నం తినడం మానెయ్యడం ఉపవాసం కాదు). అయోధ్యా నగరమంతా చాలా సంతోషంగా ఉన్నది. ఆ అయోధ్యా నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ళముందు కళ్ళాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులూ పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందురోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తిచేసుకొని, సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం వద్దకి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే, పదిహేను పక్కన పదిహేను సున్నాలు పెడితే ఎంతో, అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకొని వెళుతుందో, అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్యనుండి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర (పుట్టినప్పటినుంచి కైకేయకి దాసిగా ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో “ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏమిటి విశేషం?” అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి “కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరుగబోతోంది. అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా” అన్నది. వెంటనే మంథర కైకేయి వద్దకి వెళ్ళింది. శ్రీమద్రామాయణం – బాలకాండ – 53వ సర్గ – సంపూర్ణం
*శ్రీమద్రామాయణం* *బాలకాండ – 54వ సర్గ* ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది. *[అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం |* *రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి ||* “నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా! (చూడండి ఆవిడ ఎలా మొదలు పెట్టిందో. నిజానికి చివరకు జరిగింది అదే.) రాముడికి యువరాజ పట్టాభిషేకం జరుగుతోంది. పిచ్చిదానా! చూశావా? కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలో ఉన్నవాడు. యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమీ తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు మహాపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, అతనికి పట్టాభిషేకం చెయ్యడం మాని, కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావా కైకా?” అని అన్నది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అన్నది “అయ్యో! అలా అంటావేంటి మంథరా? నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. నిజానికి నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమీ ఉంటుంది? ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు? ఈ బహుమానం తీసుకో” అని ఒక బహుమతిని ఇచ్చింది. (ఇంత మంచిగా మాట్లాడిన కైకేయి తరువాత, తరువాత మంధర చెప్పిన మాటల ప్రభావం వలన ఎలా మారిందో మీకు తెలుసు. ఆ క్రమం వివరిస్తాను, చదవండి). కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అన్నది. “మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు. అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేక పోతున్నావు? రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు” అన్నది. “చేసుకోనీ. అందులో తప్పేముంది? రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు” అని కైకేయి అనగానే మంథర “పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు. ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఏనాటికి రాజు కాలేడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన వద్ద ఉంచుకున్నాడు. కానీ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక అతణ్ణి తన వద్ద ఉంచుకోలేదు. *శ్రీమద్రామాయణం – బాలకాండ – 54వ సర్గ – సంపూర్ణం*