top of page

శ్రీమద్రామాయణం – బాలకాండ –19,20 21వ సర్గ

శ్రీమద్రామాయణం బాలకాండ – పంతొమ్మిదవ సర్గ అలా వారు ప్రయాణిస్తూ శోణానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలపుష్పాదులతో చాలా శోభాయమానంగా కనబడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా, అందంగా ఉండడానికి కారణమేమిటని రాముడు అడుగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు “పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజసుడు, వసురాజు అనే నలుగురు కుమారులు కలిగారు. ఆ నలుగురు యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, ‘మీరు నలుగురూ నాలుగు నగరాలని నిర్మాణం చెయ్యండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చెయ్యండి’ అని ఆదేశించాడు. అప్పుడు వారు కౌశాంబీ, మహోదయము, ధర్మారణ్యము, గిరివ్రజపురము అనే నాలుగు నగరాలని నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురములో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. శోణానది ఈ అయిదు పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి రెండవ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరుకుడా ఘ్రుతాచి అనే అప్సరసకి, కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాశులు, మెరుపుతీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్లి పాటలు పాడుకుంటూ, వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి “మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతోకాలం ఉండలేరు. కొంత కాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్ళిచేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు” అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏక కంఠంతో “మావద్దనున్న అపారమైన తపఃశక్తితో మమ్మల్ని మేము రక్షించుకోగలము. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతా స్థానం నుంచి నిన్ను తొలగించగలము. మాకు పెళ్ళంటూ జరిగితే, అది ధర్మాత్ముడైన మా తండ్రిగారు ప్రతిపాదించిన వ్యక్తినే చేసుకుంటాము కానీ మా అంతట మేము నిర్ణయించుకోము. ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు” అని ఆ కన్యలందరూ ఏక కంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరములలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచత్వం కల్పించాడు. దానివల్ల వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు. తరవాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరికి వెళ్లి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, “అమ్మా! మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, పైగా ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా! స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు. అమ్మా! నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందం అంటే ఇది. ఓర్పుకి మించిన యజ్ఞం లేదు. ఓర్పుని మించిన సత్యం లేదు. ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు వల్లనే ఈ భూమి నిలబడుతోంది” అని చెప్పాడు.

శ్రీమద్రామాయణం బాలకాండ – ఇరువయ్యవ సర్గ అదే సమయంలొ చూళి అనే ఒక మహర్షికి, ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలాకాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో “నేను నీకు ఏమీ చెయ్యగలను” అని అడిగారు. అప్పుడామె “నేను ఎవరికీ భార్యని కాను. కానీ అపారమైన తపశ్శక్తి, బ్రహ్మతేజస్సు కలిగిన నీ వలన, శారీరక సంపర్కం లేకుండా, మానసికమైన తపఃఫలంతో నాకు కుమారుడు కావాలి” అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానస పుత్రుడిని సోమద కి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు, కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి, వారు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకొని కుశనాభుడిని పొగిడింది” అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ వృత్తాంత్తం విన్నాక అందరూ ముందుకి బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వారు గంగా నదిని సమీపించారు. అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగువారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి, అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని, మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు “కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుగుతుండగా కుశనాభుడి తండ్రైన కుశమహారాజు అక్కడికి వచ్చి “నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, గాధి అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు” అన్నాడు. “నేను ఆ గాధి యొక్క కుమారుడినే రామా” అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు….. “నేను కుశ వంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు. నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు ఋచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద, మా అక్క వద్ద ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగం చెయ్యడానికి వచ్చాను, నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను” అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు “నీవంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమయ్యింది, మీ అక్కగారి వల్ల మీ వంశం పరమ పావనం అయ్యింది” అని అన్నారు. అప్పుడు రాముడు గంగకి త్రిపథగ అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు…… “పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వత రాజు, ఆయన భార్య మనోరమ ఉండేవారు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవాహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలను ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనది గా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగిగా మారి, హైమవతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేబడి పాతాళానికి చేరింది, మూడు లోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపథగ అని పిలుస్తారు” అని విశ్వామిత్రుడు చెప్పాడు. “మీరు విషయాలని మనస్సుకి అతుక్కున్నేటట్టు చెప్పగలరు, కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసింది”గా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్ధించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. శ్రీమద్రామాయణం – బాలకాండ – ఇరువయ్యవ సర్గ – సంపూర్ణం

శ్రీమద్రామాయణం బాలకాండ – ఇరవై ఒకటవ సర్గ “పార్వతి పరమేశ్వరులు కైలాసంలో శత దివ్య సంవత్సరాలు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది. పార్వతీదేవి – శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి. కాబట్టి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుని ప్రార్ధించారు. అప్పుడు శంకరుడు బయటకి వచ్చాడు. అప్పుడు వారు ఆయనతో, “స్వామీ! మీరు పార్వతీదేవితో 100 దివ్యసంవత్సరాల నుంచి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే, మేము ఎవరము దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి” అన్నారు. వారు చెప్పినదానికి శంకరుడు సరే అన్నాడు కానీ ఇప్పటికే రేతస్థానము నుంచి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు. దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు “మీ తేజస్సుని భూమి భరిస్తుంది. కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకి వచ్చి నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికీ మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇకనుంచి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. శంకరుడి తేజస్సుని భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తనయందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమీ చెయ్యాలో తెలీక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు – మనోరమల కుమార్తెలైన గంగా – పార్వతులకి తేడా లేదు కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడా దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని వద్దనుంచి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యము కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది. ఈ తేజస్సుని నేను భరించలేను. నన్ను ఏమీ చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్ని పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా, శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడిని తమ పుత్రుడిగా కార్తికేయుడు (కృత్తికల పుత్రుడు) అని పిలవాలి. అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు. [తతః తు దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ | పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః ||] ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖాలతో పుట్టాడు. ఏక కాలంలో ఆరుగురు కృత్తికల స్తన్యమునందు ఆరు ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకి వచ్చిన శివ తేజస్సు కనుక ఆయనకి పావకి, అగ్నిసంభవః అని నామాలు వచ్చాయి. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్ధాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు” అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. శ్రీమద్రామాయణం – బాలకాండ – 21వ సర్గ – సంపూర్ణం

#20 #21వసరగ #శరమదరమయణబలకడ1011సరగల

0 views0 comments

Recent Posts

See All

Ramayana: History or mythology? 1) The Ramayana is one of two epics, the other being the Mahabharata, which have had a crucial influence in shaping the nature of Indian civilization. The Ramayana exis

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 45* రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు ధరించి, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతో ధనువు పైకి వచ్చి “రామా! ఇప్పుడు

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 43* అప్పుడు రాముడు “చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర

bottom of page