శ్రీమద్రామాయణంబాలకాండ – 10 +11 సర్గలు
శ్రీమద్రామాయణం బాలకాండ – పదవ సర్గ దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా చెప్పాడు. “మహారాజా! రోమపాదుని మంత్రులు ఆయనతో ఇలా చెప్పారు ‘ఋష్యశృంగుడు తాను పుట్టినది మొదలు ఈ రోజువరకూ తన తండ్రిని తప్ప మరొకరిని చూడలేదు. అతనికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అతడిలో శృంగారపరమైన కోరికలు కూడా లేవు. స్త్రీ సాంగత్యం లేకుండా పెరుగుతున్నాడు కాబట్టి అతనివద్దకు మనమే కొందరు వేశ్యలను పంపి వారి హావభావ విన్యాసాలతో ఆయనను మోహింపజేసి ఆయనను మన నగరానికి రప్పిస్తారు. స్త్రీ వ్యామోహంలో ఉన్న ఆయనను ఒప్పించి నీ కూతురు శాంతను ఇచ్చి వివాహం చేసి, ఆయనను ఇక్కడే మన రాజ్యంలోనే ఉంచుకుందాం’ అని చెప్పారు. దానికి రోమపాదుడు అంగీకరించి కొందరు శృంగారవతులైన స్త్రీలను రప్పించి విభండక ముని ఆశ్రమానికి పంపాడు. ఆ వేశ్యలు విభండకుడు లేని సమయం చూసుకొని ఋష్యశృంగునికి కనపడేటట్లు అక్కడ తచ్చాడుతూ ఋష్యశృంగుని చూసి “మునివర్యా! మీరెవరు?” అని అడిగారు. “నేను విభాండకుని పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. గతంలో నేనెప్పుడూ మిమ్మల్ని చూడలేదు. అందరిలాగా కాకుండా మీరు ఎందుకు ఇలా ఉన్నారు? (ఆయనకు స్త్రీలు ఎలా ఉంటారో ఇంతవరకూ తెలియదు. ఇప్పుడే చూస్తున్నాడు.) మీరు మా ఆశ్రమానికి వచ్చి సేద తీరండి” అని ఆహ్వానించాడు. వారికి విభాండకముని అంటే భయం. ఆ భయంతోనే లోనికి వచ్చి ఋష్యశృంగుడు ఇచ్చిన అర్ఘ్యపాద్యాదులను స్వీకరించారు. కొంచెం సేపు అక్కడ కూర్చొని ఆయన వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోతూ తాము తీసుకువచ్చిన కొన్ని మధురఫలములను ఆయనకు సమర్పించి, అంగాంగము తగులునట్లుగా ఆయనను కౌగలించుకొని వడివడిగా అక్కడినుండి నిష్క్రమించారు. ఋష్యశృంగునకు కొంచెం సేపు ఏమీ అర్థం కాలేదు. శరీరమంతా మత్తెక్కినట్లు అయ్యింది. ఏదో ఒక దివ్యానుభూతికి లోనయ్యాడు. అటువంటి అనుభూతిని ఇంతవరకూ ఆయన అనుభవించలేదు. మళ్ళీ మళ్ళీ కావాలనిపించే ఆ కౌగిలి కోసం, ఆ స్పర్శా సుఖం కోసం మానసికంగా విలవిల్లాడాడు. మరునాడు ఋష్యశృంగునికి ఆ స్త్రీలను కలుసుకోవాలనే కోరిక కలిగి క్రిందటి రోజు వారు తచ్చాడిన ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వారిని చూశాడు. “ఓ బ్రాహ్మణోత్తమా! నిన్న మేము నీ ఆశ్రమానికి వచ్చి నీ ఆతిథ్యము స్వీకరించాము కదా! ఈ రోజు మా ఆతిథ్యాన్ని తీసుకుందువుగాని మా ఆశ్రమానికి రా!” అని పిలిచారు. తమకంలో ఉన్న ఋష్యశృంగుడు వారివెంట వెళ్ళాడు. వారు చాకచక్యంగా అతనికి అందీ అందనట్లుగా మురిపిస్తూ అంగదేశములోనికి తీసుకుపోయారు. ఆయన అంగదేశం లోనికి ప్రవేశించగానే “తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని | వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||” విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రజలంతా హర్షిస్తున్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని సాదరంగా రాజభవనానికి ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి సత్కరించాడు. “మహాత్మా! తమరి రాక చే మా అంగరాజ్యం పావనం అయ్యింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రిగారు మా మీద కోపగించకుండా నన్ను అనుగ్రహించండి. నా కుమార్తె శాంతను వివాహమాదండి” అని ప్రార్థించాడు. మోహావేశంలో ఉన్న ఋష్యశృంగుడు సరేనన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంత కాలంపాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలోని – బాలకాండలో – పదవ సర్గ సంపూర్ణం ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్
శ్రీమద్రామాయణం బాలకాండ – పదకొండవ సర్గ ప్రారంభం సుమంత్రుడు దశరథమహారాజుతో ఇంకా ఇలా చెప్తున్నాడు “ఓ రాజేంద్రా! పూర్వము సనాత్కుమార మహర్షి చెప్పుచుండగా నేను విన్నది చెప్తున్నాను. ఇక్ష్వాకు రాజ వంశమున దశరథుడు అను పేరు కల ఒక మహా పురుషుడు జన్మిస్తాడు. అతడు ధార్మికుడై సర్వ శుభ లక్షణములతో సత్య సంధుడిగా ప్రసిద్ది గాంచును. అంగ రాజైన ధర్మరధునితో అతనికి మైత్రి ఏర్పడును. దశరదుడికి శాంత అను కూతురు కలదు. అంగ రాజైన ధర్మరధుని కుమారుడు చిత్రరధుడు రోమపాదుడిగా ప్రసిద్దికెక్కును. ఆయనకు దశరదుడి కూతురును పెంచుకొనుటకు ఇచ్చును. ఆ రోమపాదుడి వద్దకు సుప్రసిద్దుడైన దశరథ మహారాజు వెళ్ళును. పిమ్మట అతడు “ఓ ధర్మాత్ముడా! నాకు పుత్ర సంతానము లేదు. నాకు సంతాన ప్రాప్తికి, వంశాభివ్రుద్దికి శాంత భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకు యజ్ఞము చేయును” అని రోమపాదునికి విన్నవిస్తాడు. దశరథ మహారాజు మాటలు విని రోమపాదుడు మనసులో తర్కించుకుని ఋష్యశృంగుని ఆయనతో పంపును. దశరథుడు మనస్తాపము తీరినవాడై ఆ బ్రాహ్మణోత్తముని వెంట పెట్టుకుని వచ్చి మనస్పూర్తిగా యజ్ఞము చేయును. ఆయనకు అమిత పరాక్రమశాలురు అయిన నలుగురు కుమారులు కలుగుతారు. వారు వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయుదురు. అన్ని లోకములనందు ఖ్యాతి వహించుదురు”అని సనత్కుమార మహర్షి చెప్పిన విషయాన్ని రాజుకు తెలియజేశాడు. కావున ఓ నరోత్తమా! పుత్రార్దివైన నీవు పురోహితుల ద్వారా కాక స్వయముగా పరివారములతో వెళ్లి పుజ్యార్హుడైన ఆ ఋష్యశృంగ మహర్షిని సాదరముగా తీసుకురండు” అని పలికాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. సుమంత్రుడి మాటలు విని వశిష్టుని అనుమతి తీసుకొని, దశరథ మహారాజు తన రాణులతో, మంత్రులతో కూడి ఋష్యశృంగుడు ఉన్న రోమపాదుని నగరముకు బయలుదేరెను. వన దృశ్యములను, నదీ తీరములను దర్శించుచు క్రమముగా ఆ రాజు ముని పుంగవుడు ఉన్న ప్రదేశముకు చేరెను. రోమపాదుని నగరముకు చేరిన దశరథుడు ద్విజోత్తముడు, విభాండకుడి కుమారుడు అయిన ఋష్యశృంగుని, రోమపాదుని సమీపముగా వుండగా చూసేను. అప్పుడు రోమపాదుడు దశరథ మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకుని సముచితముగా ఆయనకు విశేష పూజలు గావించెను. ధీశాలి అయిన ఋష్యశృంగునికి రోమపాదుడు తనకు, దశరదుడికి గల మైత్రిని తెలుపగా, అప్పుడు ఋష్యశృంగుడు దశరదుడికి నమస్కరించెను. ఇట్లు సత్కారములు పొందిన దశరథ మహారాజు అక్కడ ఏడెనిమిది దినములు ఉండి రోమపాదుడితో ఇలా అనెను “ఓ మహారాజా! నీ కూతురు అయిన శాంతను, అల్లుడు ఋష్యశృంగుని నా నగరమునకు పంపు. అక్కడ ఒక మహా యజ్ఞము చేయ సంకల్పించాను” అని దశరథ మహారాజు కోరగా రోమపాదుడు అంగీకరించి ఋష్యశృంగునితో ‘ఈయనతో కలసి అయోధ్యకు వెళ్ళు’ అని చెప్పెను. ఆయన సరే అని చెప్పి భార్యతో సహా అయోధ్యకు బయలుదేరెను. దశరథుడు రోమపాదుని వద్ద సెలవు తీసుకుని అయోధ్యకు బయలుదేరెను. వేగముగా వెళ్ళు దూతలచే తమ ఆగమన వార్తను పుర జనులకు సందేశము పంపెను. “నగరమునందు అంతటా పూలదండలతో, అరటి స్తంభములతో, అలంకరింపుడు. కస్తూరి కల్లాపి తో సుగంధ ధూప పరిమళములతో వీధులను గుభాళింప చేయండి. పతాకములను ఎగురవేయండి” అని సందేశము పంపెను. పౌరులు రాజుగారి శుభాగమన వార్తను విని మిక్కిలి సంతోషించిరి. రాజుగారి సందేశము ప్రకారము పూర్తిగా నగరమును అలంకరించిరి. పిమ్మట దశరథుడు శంఖ దుందుభ ద్వనుల మద్య విప్రోత్తముడైన ఋష్యశృంగుని ముందు ఉంచుకుని, బాగా అలంకరింప బడిన నగరములో ప్రవేశించెను. దశరథుడు ఆయనను తన అంతః పురమునకు తీసుకొని వచ్చి శాస్త్రోక్తముగా పూజించెను. ఆయన రాకతో కృతార్దుడైనట్లు తలచెను. భర్తతో కూడి అంతః పురానికి విచ్చేసిన శాంతను చూసి అంతఃపుర కాంతలు ఎంతో సంతోష పడిరి. ఆమె, ఆమె భర్త అక్కడ కొంతకాలము వుండిరి. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలోని – బాలకాండలో – పదకొండవ సర్గ సంపూర్ణం ఓంతత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్