top of page

శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 43 & 44

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 43* అప్పుడు రాముడు “చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను. అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కింద పడతాయి. నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము” అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు). ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి “నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను. నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు” అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు. జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు. తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ వద్ద అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని “నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనిద్దరమూ ఈ వనం లో క్రీడిద్దాము” అన్నది. లక్ష్మణుడు ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది. తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు “అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడ వంజులకం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది. కానీ పరమ దారుణమైన యుద్ధం జరుగుతుంది” అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దగ్గరనుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటి ఇలా ఉంది అని వారు అనుకుంటున్నారు. ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది “నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను” అని అంటూ వాళ్ళని దగ్గరగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో “మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు. అందుకని వీడి చేతులని ఖండించేద్దాము” అన్నాడు. *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 43 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 44* అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు “మీరు ఇద్దరు ఎవరు?” అని అడిగాడు. “ఈయనని రాముడు అంటారు. దశరరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు. ఈయన ముగ్గురు తమ్ముళ్లలో నేను ప్రథముణ్ణి. తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేమిటి? నీలాంటి రాక్షసుడిని మేము ఎప్పుడూ చూడలేదు” అని లక్ష్మణుడు అన్నాడు. అప్పుడా కబంధుడు “నేను మీకు నా కథ చెబుతాను. కానీ మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేమిటంటే, ఒక పెద్ద గొయ్యి తీసి అందులో నన్ను కప్పేయండి. లేకపోతే ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి” అన్నాడు. “సరే, నువ్వు కోరినట్టే చేస్తాములే. కానీ, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా?” అని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడా కబంధుడు “మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు. కానీ ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి” అన్నాడు. “కాలుస్తాములే కానీ, నువ్వు అసలు ఎవరు? ఇలా ఎందుకు ఉన్నావు?” అని రామలక్ష్మణులు అడిగారు. అప్పుడు కబంధుడు “పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. అదేమిటంటే, “నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది” అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి “ఇలా ఈ రూపంతో తిరగడం నీకు ఎంతో సరదాగా ఉన్నట్లుంది. నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు’ అని వెళ్ళిపోయారు. వెంటనే నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ‘మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కానీ నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది’ అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ‘నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ‘ఏమి కావాలి’ అని అడిగారు. ‘నాకు దీర్ఘాయువు కావాలి’ అని అడిగాను. బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘ ఆయుర్దాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది, అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది. నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరంతో కిందపడ్డాను. అప్పుడు నేను ఇంద్రుడితో ‘నువ్వు నన్ను కొట్టేశావు, బాగానే ఉంది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కదా, మరి నేను ఏమీ తిని బతకను’ అని ఇంద్రుడిని అడిగాను. ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగం మీద ఏర్పాటు చేసి, యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు. రామా! నేను అప్పటినుండి ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను. ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను” అన్నాడు. (మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటాము. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది.) *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 44 – సంపూర్ణం*

#శరమదరమయణఅరణయకడ1amp2

0 views0 comments

Recent Posts

See All

Ramayana: History or mythology? 1) The Ramayana is one of two epics, the other being the Mahabharata, which have had a crucial influence in shaping the nature of Indian civilization. The Ramayana exis

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 45* రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు ధరించి, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతో ధనువు పైకి వచ్చి “రామా! ఇప్పుడు

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 41* శాంతించిన రాముడితో లక్ష్మణుడు “అన్నయ్యా! చూశావా లోకం పోకడ ఎలా ఉంటుందో! కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాత

bottom of page