శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 3
*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 3* వారు శరభంగ ముని ఆశ్రమానికి చేరుకోగానే, వాళ్ళకి ఆకాశంలో నిలబడిన ఒక రథం కనబడింది. ఆ రథానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డారన్నట్టు ఆ గొడుగు ఉంది. రథం అంతా మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరముల వయసు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకొని, దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథం లోని ఆసనం పక్కన వింజామరలు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. కానీ ఆ ఆసనం ఖాళీగా ఉంది. ఆ ఆసనం మీద కూర్చోవాల్సిన వ్యక్తి శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు. గాలిలో నిలబడి ఉన్నాడు. ఇది గమనించిన రాముడు వెంటనే లక్ష్మణుడిని పిలిచి “లక్ష్మణా! మనం వేదంలో చదువుకున్నాము కదా, ఆకుపచ్చ గుఱ్ఱములు కట్టినటువంటి రథం మీద వచ్చే వ్యక్తిని ‘ఇంద్రా’ అని పిలుస్తాము కదా, అదిగో ఆ ఇంద్రుడు ఇప్పుడు వచ్చినట్లున్నాడు. శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. కావున మనం అందరం ఒకేసారి లోపలికి వెళ్ళిపోకూడదు. అందుకని ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒకసారి చూస్తాను” అన్నాడు. అలా లోపలికి వస్తున్న రాముడిని ఇంద్రుడు చూసి, శరభంగుడితో ఇలా అన్నాడు *[ఇహ ఉపయాతి అసౌ రామో యావన్ మాం న అభిభాషతే |* *నిష్ఠాం నయత తావత్ తు తతో మా ద్రష్టుం అర్హతి ||]* “రాముడు వచ్చేస్తున్నాడు. రాముడి వంక నేను చూడను. మాట్లాడను. ఎందుకంటే ముందు ముందు రాముడు సాధించవలసిన గొప్ప దేవకార్యం ఒకటి ఉంది. అప్పుడు నేను వచ్చి రాముడిని అభినందిస్తాను. ఇక సెలవు మహర్షి” అని వెళ్ళిపోయాడు. అప్పుడు రాముడు సీతమ్మని, లక్ష్మణుడిని తీసుకొని శరభంగ ముని ఆశ్రమంలోనికి వెళ్ళి తన రెండు చెవులని పట్టుకొని శరభంగుడికి తన ప్రవర చెప్పి, నేను రాముడిని వచ్చాను అని అన్నాడు. “రామా! నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపఃశక్తితో ఇంద్రలోకాన్ని, బ్రహ్మలోకాన్ని గెలిచాను. అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు స్వయంగా వచ్చి నన్ను రమ్మన్నాడు. కానీ నేను, ‘నాకు ప్రియమైన అతిధి వచ్చాడు, అతనికి ఆతిధ్యం ఇచ్చాక వస్తాను’ అన్నాను. రామా! నేను నా తపఃశక్తితో గెలుచుకున్న లోకాలని నీకు ధారపోసేస్తాను. యధేచ్చగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు” అని శరభంగుడు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు “మహానుభావా! మీరు తపస్సు చేసి సాధించిన లోకాలను నాకు ధారపొయ్యడమేమిటి? నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు. అక్కడ నేను తపస్సు చేసుకుంటాను” అన్నాడు. *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 3 – సంపూర్ణం*