top of page

శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 1 & 2

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 1* *[రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం | *దదృశుర్ విస్మిత ఆకారా రామస్య వన వాసినః ||]* *[వైదేహీం లక్ష్మణం రామం నేత్రైర్ అనిమిషైర్ ఇవ |* *ఆశ్చర్య భూతాన్ దదృశుః సర్వే తే వన వాసినః ||]* దండకారణ్యం లోని ఒక ఆశ్రమం దగ్గరకు వచ్చాక, రాముడు తన ధనుస్సు యొక్క వింటినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు సీతారామలక్ష్మణులను చూసిన ఆ ఋషులు, వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యంతో విస్మయులై అలా ఉండిపోయారు. బ్రహ్మతేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆనాడు రాముడి తేజస్సుని చూసి అలా ఉండిపోయారు. అప్పుడా ఋషులు “మహానుభావా! మేము అందరమూ నీకు నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే నువ్వు రాజువి. రాజకుటుంబం నుంచి వచ్చినవాడివి. ఇంద్రుడి యొక్క అంశలో నాలుగవ వంతు అంశ రాజులో ఉంటుంది. వనాలలో దూరంగా ఉన్నవాళ్ళని, నగరాలలో ఉన్నవాళ్ళని రాజు తన శాసనంతో రక్షిస్తాడు. బలం లేనివాడికి రాజు యొక్క బలమే రక్ష. బలం ఉందని చెలరేగిపోయేవాడికి రాజు యొక్క బలం – శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము. మా తపస్సులో రాజుకి ఆరవ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి. నీకు ధర్మం తెలుసు. అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు. అందుకని రామా! నువ్వు మమ్మల్ని ఆ రాక్షసుల బారినుంచి రక్షించాలి” అని అన్నారు. అప్పుడు రాముడు వాళ్ళ ప్రార్ధనలని స్వీకరించి, వారు ఇచ్చిన అర్ఘ్య పాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడినుంచి బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళాక ఒకచోట చీకురువాయువులనే ఈగలు రొద చేస్తూ కనబడ్డాయి (ఈ ఈగలు పులిసిపోయి పడిఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి). ‘అయితే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడు’ అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోనికి చొచ్చుకు పోయిన కళ్ళతో, భయంకరమైన కడుపుతో, పర్వతమంత ఆకారంతో, పెద్ద చేతులతో, అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురోడుతుండగా తన వొంటికి చుట్టుకొని, ఒక శూలాన్ని భుజానికి ధరించినవాడై, ఆ శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చినవాడై, వొంటి నిండా మాంసం అంటుకున్నవాడై ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన వొళ్ళో కుర్చోపెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. *[అధర్మ చారిణౌ పాపౌ కౌ యువాం ముని దూషకౌ |* *అహం వనం ఇదం దుర్గం విరాఘో నామ రాక్షసః ||]* *[చరామి సాయుధో నిత్యం ఋషి మాంసాని భక్షయన్ |* *ఇయం నారీ వరారోహా మమ భార్యా భవిష్యతి ||]* *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 1 – సంపూర్ణం*

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 2* “మీరు అధర్ములు. పాపమైన జీవితాన్ని గడుపుతున్న వారు. ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను. ఇకనుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపొండి. నన్ను విరాధుడు (రాధ్ అంటే ఆనందం, విరాధ్ అంటే ఆనందానికి వ్యతిరేకం) అంటారు. నేను ఈఅరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషుల మాంసం తినడం చాలా ఇష్టమైన పని” అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో “చూశావా లక్ష్మణా! ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతోందో! నాకు ఎంత కష్టమొచ్చిందో చూశావా? నా కళ్ళ ముందు పరాయివాడు నా భార్యని ఎత్తుకొని తీసుకెళ్ళి, తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. నాకు చాలా దుఃఖంగా ఉంది” అని, ఆ విరాధుడి వైపు చూసి “మమ్మల్ని ఎవరు అని అడిగావు కదా! మేము దశరథ మహారాజు పుత్రులము. మేము రామలక్ష్మణులము. మా తండ్రిగారి మాట మీద అరణ్యాలలో సంచరిస్తున్నాము. అసలు నువ్వు ఎవరు?” అని అడిగాడు రాముడు. అప్పుడా విరాధుడు “నేను జవుడు అనే ఆయన కుమారుడిని. మా అమ్మ పేరు శతహ్రద. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను” అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా, రామ లక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. అప్పుడా విరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడి పోయాయి. అప్పుడు వారు అనేక బాణములతో ఆ విరాధుడిని బాధపెట్టారు. ఆగ్రహించిన విరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణములచేత ఆ శూలాన్ని గాలిలోనే ముక్కలు చేశాడు. అప్పుడా విరాధుడు సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులనిద్దరినీ పట్టుకొని, తన భుజాల మీద వేసుకొని అరణ్యంలోకి వెళ్ళాడు. ఇది చూసిన సీతమ్మ గట్టిగా ఆక్రందన చేసింది. అప్పుడు రాముడు తన బలం చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచేశాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కిందపడ్డాడు. కిందపడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టారు. పైకి కిందకి పడేసారు. అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతిపెట్టాల్సిందే అని, రాముడు లక్ష్మణుడితో, ఏనుగుని పట్టడానికి తవ్వే ఒక పెద్ద గొయ్య తవ్వమని, ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యం అంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వేసాడు. అప్పుడా విరాధుడు “నేను తపస్సు చేత బ్రహ్మగారి వరం పొందాను. అందువలన నన్ను అస్త్ర-శస్త్రములు ఏమీ చెయ్యలేవు. నాకు ఇప్పుడు అర్ధమయ్యింది. నువ్వు కౌసల్య కుమారుడవైన రాముడివి. నీ భార్య వైదేహి. నీ తమ్ముడు లక్ష్మణుడు అని. నేను ఒకప్పుడు తుంబురుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. కానీ, నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామము వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. అప్పుడు నేను కుబేరుడిని నాకు శాపవిమోచనం ఎలా కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో, ఆనాడు నువ్వు శాపవిముక్తుడవై మళ్ళీ స్వర్గాన్ని పొందుతావు అని కుబేరుడు శాపవిమోచనం చెప్పాడు. కాబట్టి నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి. ఇక్కడినుంచి ఒకటిన్నర యోజనముల దూరం వెళితే శరభంగ మహర్షి ఆశ్రమం ఉంది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి. నీకు మంచి జరుగుతుంది” అని విరాధుడు రాముడితో అన్నాడు. తరువాత రామలక్ష్మణులు ఆ విరాధుడిని ఆ గోతిలో వేసి, మట్టితో పుడ్చేసి, శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళారు. *శ్రీమద్రామాయణం – అరణ్యకాండ – 2 – సంపూర్ణం*

#శరమదరమయణఅరణయకడ1amp2

0 views0 comments

Recent Posts

See All

Ramayana: History or mythology? 1) The Ramayana is one of two epics, the other being the Mahabharata, which have had a crucial influence in shaping the nature of Indian civilization. The Ramayana exis

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 45* రామలక్ష్మణులు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు ధరించి, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతో ధనువు పైకి వచ్చి “రామా! ఇప్పుడు

*శ్రీమద్రామాయణం* *అరణ్యకాండ – 43* అప్పుడు రాముడు “చూశావా లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర

bottom of page