రామ రసం ప్రాముఖ్యత,వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం … పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం … వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.
ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం … పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం … పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని… పోషకాలను అందిస్తూ ఉంటాయి.
జీర్ణ సంబంధమైన … మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త … కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం … వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
శ్రీరామనవమి “శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము” జరుగుతున్న శుభ సందర్భంగా…వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, నాభాగ మహారాజ వర్మణో నప్త్రే… అజ మహారాజ వర్మణః పౌత్రాయ… దశరథ మహారాజ వర్మణః పుత్రాయ… శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం… స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం… హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం… జనక మహారాజ వర్మణః పుత్రీం… సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…
