top of page

మనకు తెలియని మహాభారత యోధుడు- బర్బరీకుడు

బర్బరీకుని గురించి మనకు అంతగా మహాభారత సమయ యోధునిగా తెలియదు. ఇతని వృత్తాంతం వివరంగా స్కాందపురాణం మహేశ్వర ఖండంలో చెప్పబడి వుంది. ఇతని చరిత్ర ఇతః పూర్వం మనం చర్చించుకున్న ఇరావంతునికి ఆపాదించి కొన్ని జానపదకధలు పుట్టుకొచ్చాయి. ఇతని వృత్తాంతం పూర్తిగా చదివితే ఎన్నో విషయాలు మనకు అవగతమవుతాయి.

ఒకసారి పాండవులు అందరూ సభలో శ్రీకృష్ణుని సముఖాన సభచేసి వుండగా ఘటోత్కచుడు వచ్చి తమ తండ్రులకు ప్రణమిల్లి ప్రేమతో యుధిష్టరుని తొడపై కూర్చోపెట్టుకుని వుండగా అతడికి సరైన తోడు ఎవరని శ్రీకృష్ణుని అడుగుతారు. అందుకు ఆయన నరకాసురుని కొడుకైన భగదత్తుని ప్రగ్జోతిష్పురంలో ఉన్న మురుడు అను పేరుగల రాక్షస కుమార్తె కామకటాంకట సరైన జోడి అని, ఆ అమ్మాయి శ్రీకృష్ణునితో యుద్ధం చెయ్యగా ఆమెను రక్షిస్తున్న కామాఖ్య దేవి ఆమెకు ఎదురులేని ఖడ్గం డాలు ఇచ్చి దీవించానని, కావున ఆమెను వదలమని వేడుకుందని ఆమె భీముని కోడలు కాగలదని ఆవిడ చెప్పిందని చెబుతాడు. శ్రీకృష్ణుని, తండ్రుల అనుమతి తీసుకుని ఘటోత్కచుడు ఆమె వద్దకు వెళ్లి ఆమె పెట్టిన పరీక్షలలో నెగ్గి ఆమెను ఓడించి, ఇంద్రప్రస్థానికి తీసుకువచ్చి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. అక్కడ వారికి నల్లని మేని, కుండలాంటి తల చక్కని రింగురింగుల జుట్టుతో ఒక కొడుకు పుట్టి పుట్టగానే పెద్దవాడవుతాడు, అతడి శోరోజాలు బర్బర(ఉంగరాల జుట్టు) తో ఉండడం వలన అతడికి బర్బరీకుడు అని నామకరణం చేస్తాడు. ఈ బర్బరీకుడు తన తండ్రిలా ఎంతో తెలివి, ధైర్యం, శౌర్యం కలవాడు. అతడిని తీసుకుని ఘటోత్కచుడు ద్వారకకు తీసుకువెళ్ళి కృష్ణుని శరణాగతి చేస్తాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుని మహీసాగర సంగమంలో గుప్తక్షేత్రం వద్ద నవదుర్గ ఉపాసన చెయ్యమని ఆదేశిస్తాడు. అక్కడ అమ్మవారిని ఆరాధిస్తూ ఎన్నో విద్యలను నేర్చుకుంటూ ఉంటాడు.

ఒకసారి పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో అందరూ ఈ వనం వద్దకు వెళ్ళడం తటస్థిస్తుంది. అక్కడ ఉన్న తటాకంలో నీటిని తీసుకురమ్మని యుధిష్టరుడు ఆదేశించగా భీముడు ఆ తటాకంలో అడుగు పెట్టగా ఆ నీటిని దేవి అభిషేకానికి వాడేవని, వాటిని మలినం చేసినందున వారికి శిక్ష తప్పదని తమ తాతలను గుర్తు పట్టని బర్బరీకుడు భీముని ఎత్తి కిందకు విసరబోతాడు. అప్పుడు అమ్మవారు అతడికి వారు తాతలన్న విషయం చెప్పి భీముని శరణువేడమని ఆదేశిస్తుంది. తాను చేసిన తప్పుకు భీముని క్షమార్పణ వేడుకుని, శిక్షగా సముద్రంలో దూకబోగా అమ్మవారితో సహితంగా శివుడు సాక్షాత్కరించి అతడి మరణం శ్రీకృష్ణుని చేతిలో అని, ఈ ప్రయత్నం మాని అక్కడ శివలింగ ప్రతిష్ట చేసి తపస్సు చెయ్యమని ఆదేశిస్తాడు. అదే భీమేశ్వర లింగం. అక్కడ అమ్మవారికి పూజ చెయ్యమని భీముని ఆదేశించగా కృష్ణుడు, శివుడు ఉండగా అమ్మవారికి పూజ ఏమిటని హేళనగా మాట్లాడగా భీముని కళ్ళు పోగా, తన తప్పు తెలుసుకుని అమ్మవారిని పూజించి తిరిగి స్వస్థుడవుతాడు.

కాలప్రవాహంలో కురుక్షేత్రయుద్ధం తప్పని సరి అయినపుడు బర్బరీకుడు తనకు అమ్మవారిచ్చిన మూడు దివ్యబాణాలతో ఓడిపోయేవారికి అండగా ఉంటానని తన తల్లికి మాటిచ్చి వస్తుండగా అతడి శక్తిని పరీక్షించే నెపంతో శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని వేషంలో అతడిని తన శక్తిని చూపమని అడుగుతాడు. అక్కడున్న ఒక చెట్టుకున్న ఆకులన్నింటినీ ఒక బాణంలో దండగా గుచ్చి తెమ్మని పరీక్ష పెట్టి, బర్బరీకునికి తెలియకుండా ఒక ఆకు తన కాలికింద తొక్కిపెట్టి ఉంచుతాడు. అతడికున్న మహిమాన్విత బాణాలలో మొదటిది వేటిమీద ప్రయోగం చెయ్యాలో వాటిని గుర్తిస్తుంది, రెండవది వేటిని రక్షించాలో వాటిని గుర్తిస్తుంది, మూడవది మొదటి బాణం గుర్తుపెట్టిన వాటిని పట్టుకుంటుంది. అన్నీ ఆకులను గుచ్చి వచ్చి కృష్ణుని కాలిచుట్టూ తిరుగుతూ వుండగా బర్బరీకుడు ఆయన కాలిని తీయమని కాలిక్రింద ఒక ఆకు వుందని నివేదిస్తాడు, ఆయన కాలు తియ్యగా ఆ ఆకును కూడా పట్టుకువచ్చి అతడి ముందు నిలుస్తుంది. బ్రాహ్మణ వేషంలో ఉన్న కృష్ణుడు ఇలా తర్కిస్తాడు, బర్బరీకుడు ఓడిపోతున్న సైన్యం వైపు యుద్ధం చేస్తాడు కనుక కొన్నాళ్ళు ఇటు, కొన్నాళ్ళు అటు యుద్ధం చేసి మొత్తానికి అందరినీ నాశనం చేస్తాడు, తనదగ్గర దాచి ఉంచినా పాండవులను చంపగల సామర్ధ్యం ఆ బాణాలకు ఉన్న కారణం వలన అతడిని ఒక దానం చెయ్యమని యాచించి అతడి తల తీసుకుంటాడని ఒక పాఠం. మరొక పాఠం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ముందు అందరూ ఆ రంగంలో పరిశీలన చేస్తుండగా ఎవరెవరికి ఈ యుద్ధం ముగించడానికి ఎన్నాళ్ళు పడుతుందని అడుగగా, అందరూ 18 రోజులు, 25 రోజులు ఇలా చెబుతుండగా బర్బరీకుడు ఒక్క ఘడియలో యుద్ధం ముగిస్తానని అతడి మూడు బాణాల సామర్ధ్యం వివరించగా శ్రీకృష్ణుడు పాండవులు హాహాకారాలు చేసేట్టుగా సుదర్శనచక్రంతో అతడి తల తెగ్గోస్తాడు. దానికి కారణం శ్రీకృష్ణ జనన పూర్వం బ్రహ్మాదులు నారాయణుని భూభారం తగ్గించమని ఆయనను వేడుకోగా సూర్యవర్చసుడు అన్న యక్షుడు ఆయన వరకు ఎందుకు తాను వెళ్లి అందరిని చంపేసి వస్తానని అహంకరించగా బ్రహ్మ అతడిని భూలోకంలో పుట్టి కృష్ణుని చేతిలో అతని గర్వం అణచబడేలా అతడికి శాపవాక్కు ఇచ్చాడని దుర్గాదేవి ప్రత్యక్షమై భీమాదులకు చెబుతుంది.

అతడి ఆఖరి కోరిక మేరకు కురుక్షేత్రంలో ఒక ఎత్తైన కొండ మీద అతడి తలను ఉంచుతారు. అతడు మొత్తం యుద్ధం తనివిదీరా చూసాక అతడికి ఊర్ధ్వలోకాలు సిద్ధిస్తాయి. పాండవులు యుద్ధానంతరం ఎవరి శౌర్యం వలన తాము యుద్ధం గెలిచామో చర్చించుకుంటుండగా అర్జునుడు కృష్ణుని దయవలన తాను ఎందరిని చంపాడో చెప్పగా, వందమంది కౌరవులను తానే చంపానని భీముడు అహంకరించగా, ధర్మరాజు బర్బరీకుని అడుగగా అతడు తనకు యుద్ధం మొత్తం కేవలం శివకేశవులు అర్ధహరిహర రూపంలో ఉండి నారాయణ చక్రం ద్వారా సంహారక్రీడ రచిస్తుండగా కాళికాదేవి వారిని చప్పరించిందని ఇదంతా కేవలం కాలపురుషుడైన శ్రీకృష్ణుని మహిమగా గుర్తెరగాలని వారికి చెబుతాడు. వారంతా శ్రీకృష్ణపాదాలను పట్టుకుని తమను నిమిత్తమాత్రంగా చేసి వైరులను చంపినందుకు శరణాగతి చేస్తారు.

పారమార్దికంగా ఈ మూడు బాణాలకు ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక త్రివిధతాపాలను చెబుతారు పండితులు. వారి వారి సంచిత కర్మలు ఎవరెవరు పోతారో గుర్తుపెట్టగా, ఆగామికర్మ ఎవరికి ఇంకా లోకంలో నూకలున్నాయో గుర్తిస్తే ప్రారబ్ధం ఎవరెవరిని సంచితం గుర్తు పెట్టిందో వారిని మట్టుపెడుతుంది. ఇది కర్మల ప్రతిరూపం అనుకుంటే, శ్రీకృష్ణుని శరణాగతి చేసినవారికి వీటినుండి రక్షణ కలిగి ఆ తాపాలను, కర్మలను నశింప చేసి రక్షిస్తాడని ఈ కధలో మనం గ్రహించవలసిన విషయం. ఎల్లప్పుడూ మన భూత భవిష్యత్ వర్తమానాలను శాసించే స్వామీ మన తిరుమల మీద ఉన్న ఆయనను శరణాగతి చేస్తే మనలని ఈ సంసార సాగరం నుండి దాటిస్తాడు అన్నది సత్యం సత్యం పునఃసత్యం

!! ఓం నమో వేంకటేశాయ !!

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page