top of page

ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది !??

ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది !?? – తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి

‘ప్రదక్షిణం’ లో ‘ప్ర’ అనే అక్షరము పాపాలకి నాశనము…. ‘ద’ అనగా కోరికలు తీర్చమని, ‘క్షి’ అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ణ’ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని.

గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణము లో ఇంత అర్ధం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నానని అర్ధం.

గుడికి వెళ్ళిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. ప్రదక్షిణలు అయితే చేస్తాం కానీ, ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు. ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది.

గుడిలో వుండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం. ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ సమర్పిస్తాం. దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు.

మనకి కనిపించే ‘సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటంవల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి (సూర్యరశ్మి) ని పొందుతోంది.ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా వుంటాయి. ఇలా భ్రమణం ‘చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు. ఇది మనస్సుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు.

దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు లెక్క. అసలు దేవాలయంలోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం చేయాలి.

ధ్వజస్తంభానికి జీవధ్వజం అనే మరో పేరు కూడా ఉంది. అదేవిధంగా దారు బేరం అని కూడా పిలుస్తుంటారు. దారువు అంటే చెక్క అని అర్థం. మద్ది, పనస, బొగడ, వేగిస, రావి, మారేడు, మోదుగ వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తుంటారు. ధ్వజస్తంభం కింద కూర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. వైష్ణవాలయాల్లో పైన పతాకం లాగ మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్లు ధ్వజస్తంభం ఉంటుంది. ఇలా మూడు భాగాలుగా ఉన్న వాటిని మేఖల అని అంటారు. చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును వేస్తుంటారు. కొన్ని కొన్ని ఆలయాల్లో వెండి, బంగారుపు తొడుగులను వేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే మానవదేహమే దేవాలయంగా పాదం నుంచి శిరస్సు వరకు వ్యాపించి నిటారుగా నిలిచి ఉన్న ధ్వజస్తంభం.

ప్రదక్షిణలు చేసే సమయంలో మెల్లగా నడవాలి. అంతేతప్ప, వేగంగా పరుగెత్తినట్లు ప్రదక్షిణ చేయకూడదు. ప్రదక్షిణం చేసే సమయంలో చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయవచ్చు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఆయా దేవతలకు సంబంధించిన అష్టోత్తరనామాలను చెపుతూ ప్రదక్షిణ చేయడం మంచిది. అష్టోత్తరనామాలు తెలియనివారు పరమాత్మను ధ్యానిస్తూ, లేక ఆ స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, మనస్సు, ఆలోచనలు స్వామిపైనే కేంద్రీకరింపజేసుకోవాలి. సాధారణంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితి. అంతేకాకుండా, ఐదుసార్లు లేక తొమ్మిది సార్లు చేయవచ్చు. మొక్కుబడి ఉన్నవారు లేక తగినంత సమయం ఉన్నవారు 108 (సార్లు) ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే ఆంజనేయస్వామివారి ఆలయంలో 41 (సార్లు) ప్రదక్షిణలు చేయడం మంచిది. సాధారణంగా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు చాలామంది మనసులు ప్రదక్షిణల సంఖ్యను లెక్కబెట్టుకోవడంలోనే నిమగ్నమై ఉంటుంటాయి. ఇలా ప్రదక్షిణలు చేయడంవల్ల ఎలాంటి ఫలితముండదు. అలా ప్రదక్షిణల సంఖ్యను లెక్క పెట్టాలనుకొనేవారు, వక్కలను గాని, పసుపుకొమ్ములనుగాని, నిర్ణీత సంఖ్యలో తీసుకెళ్ళి ప్రదక్షిణ మార్గంలో ఒకచోట ఉంచుకుని, ప్రదక్షిణ పూర్తిచేసి, అక్కడికి వస్తూనె ఒకదానిని తీసి ప్రక్కన ఉంచుకోవాలి. అలా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క దానినితీసి ప్రక్కన పెట్టడం వల్ల, సరిగా ప్రదక్షిణలు చేసిన లెక్క ఉంటుంది. దేవునిపై మనస్సును లగ్నం చేసినట్లుగాను ఉంటుంది.

మహిమాన్వితమైన ‘ప్రదక్షిణ’లో అనేక రకాలున్నాయి.

1. ఆత్మప్రదక్షిణ: సాదారణంగా ఇంట్లో ఏదైన వ్రతం లేక పూజ చేసిన తరువాత:

శ్లో||

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ

తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల

అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన!

అనే శ్లోకాన్ని పఠిస్తూ, మనచుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణాపథం లేనప్పుడు ఒకేచోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది.

2. పాదప్రదక్షిణ: సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాపథంలో గానీ, ఆలయం చుట్టుగాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది.

3. దండ ప్రదక్షిణ: ప్రదక్షిణాపథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి, అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగనమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయడాన్ని దండప్రదక్షిణ అనంటారు. ఈ పద్ధతిలో నాలుగుదిక్కులలోగానీ, లేక నాలుగుదిక్కులు, నాలుగుమూలలు కలిపి ఎనిమిదిచోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు.

4. అంగప్రదక్షిణ: మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకుని, ఆలయం చుట్టూ దొర్లుతూచేసే ప్రదక్షిణకు అంగప్రదక్షిణ అని పేరు.

5. పైన పేర్కొన్న ప్రదక్షిణా పద్దతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణే మిశ్రమప్రదక్షిణ.

సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు, అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలోగాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి, స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని అఆలయాలలో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి.

అయితే …

దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే… శివుడు దేవదేవుడు. అంటే… దేవుళ్లకే దేవుడు. కాబట్టి… ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా… పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ… గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.

శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం( శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. ఈ విధమైన ప్రదక్షిణలు శివునికి భక్తులు బేసి సంఖ్యలో వచ్చే విధంగా 3,5,7,9 ప్రదక్షిణలు చేయవచ్చు.

శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page