పూజలు చేయాలి. ఫలితం కోసం కష్టపడాలి
ఏదైనా ఒక పూజ, నోము, వ్రతము లాంటివి మఱియు ఆలయ సందర్శనం చేయదలిస్తే భార్యాభర్తలు కలిసి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. అంతేకాదు కలిసి చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. ఫలితం కూడా చాలా అధికంగా ఉంటుంది.
భార్య తాటకీల నేను చేయను అన్నా, భర్త కుంభకర్ణుడై బద్ధకస్థుడిలా నేను చేయను/రాను అని మొరాయించినా ఆ పూజల, ఆలయ దర్శనాల ఫలితం చాలా స్వల్పంగా ఉంటుంది. నీకు నీవే నాకు నేనే అనుకుంటూ చేసిన ఏ కార్యంలో అయినా ఫలితం పుణ్యం చాలా స్వల్పమే కాకుండా ఆ ఫలం కూడా అంతగా ప్రభావం చూపదు.
కనుక ఎప్పుడైనా ఎలాంటి పుణ్యకార్యమైనా, దాన ధర్మాలైనా భార్యాభర్తలు ఇరువురు కలిసి చేయడం ప్రధానం. లాభం కూడా. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు పెద్దలు. అంతేతప్ప
ఆస్తుల కొద్దీ పురుషుడు, చదువులు సంపాదనల కొద్దీ బిడ్డలు అనలేదు. మనం దేనికోసమని ఎంత కష్టపడతామో అలాగే పూజాది కార్యక్రమాలు కోసం కూడా కొంత కష్టపడితేనే ఫలితం ఉంటుంది. అదికూడా భార్యాభర్తలు కలిసి చేస్తే ఆ ఫలితం అత్యధికంగా ఉంటుంది.
పూజలు చేస్తూ అన్ని దేవుడే చూసుకుంటాడు అంటే మీవైపు పరమాత్ముడు కన్నెత్తి కూడా చూడడు. ఆయన కూడా నీకు నువ్వే నాకు నేనే అని దేవలయంలోనే కూర్చుంటాడు. పూజలు చేయాలి. ఫలితం కోసం కష్టపడాలి అప్పుడే వచ్చే ఫలితం అనుకూలంగా ఉంటుంది…