top of page

 పంచ తన్మాత్ర సాయకా : ఓం శ్రీమాత్రే నమః!

ఓం శ్రీమాత్రే నమః!

 పంచ తన్మాత్ర సాయకా

శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడు తన్మాత్రలు జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశలు. పంచతన్మాత్రలు అనబడును. పరమేశ్వరి దీనిని బాణములుగా ధరించి ఉన్నది. పరమేశ్వరి వామోర్ధ్వకరమున ధనుస్సును దక్షోర్ధ్వకరమున బాణములను ధరించి ఉన్నది.

ధనుస్సు లేక బాణములు, బాణములు లేక ధనుస్సు నిష్ప్రయోజనములు, అనగా ధనుర్బాణ సంధానమున గాని లక్ష్యము సిద్దింపదు. ఈ ధనుర్బాణ సంధానము గురుముఖైక వేద్యము, సాయకములు లక్ష్యార్ధ సాధనములు. ఇచట లక్షము ప్రపంచ నిర్మానము.

బీజరూపములగు శబ్దాదులు రూప రహితములగుట అగోచరములు. దృశ్యప్రపంచ నిర్మాణమునకుగా స్థూలదేహ నిర్మానార్ధము పంచభూత తన్మాత్రల పంచీకరణమొనర్చి తన కార్యసాధనకు ఉపయోగించుకొనుటచే పరమేశ్వరి పంచతన్మాత్త్రసాయకా అని స్తుతింపబడుచున్నది.

“శబ్ద స్పర్శాదయో బాణ మనస్తసాయ భవద్ధనుః” బాణాస్త త్రివిధా ప్రోక్తా: స్థూల సూక్ష్మ పరతత్వత: (వా.తం)

స్థూల; పుష్పమయా; సూక్ష్మా మంత్రాత్మానస్సమీరిత  పరాస్త వాసనాయాంతూ ప్రోక్తా; స్థూలాన్ శ్రృణుప్రియే (తంత్రరాజే)

మనో భావే దిక్షుధను: పాశో రాగ ఉదీరితః! ద్వేష; స్యాడం కుశః పంచ తన్మాత్రా : పుష్ప సాయకా:! (తంత్రరాజే)

సాయకములు స్థూలసూక్ష్మ కారణములు అను మూడురకములు. పుష్ప బాణములు స్థూలములు. బీజరూపములు సూక్ష్మములు. వాసనా రూపములు కారనములు. పూర్వ గ్రంధముల లోని కొన్ని సాయక పంచకములు చెప్పబడుచున్నవి.

కాదిమతే = పద్మము, రక్త కైరవము, కల్హారము, ఇందీవారము, చూతము అనునవి

జ్ఞానార్ణవే – ద్రాం ద్రీం క్లీం బ్లూం స: – పంచ బాణేశ్వర బీజములు . క్షోభణము, ద్రావణము, ఆకర్షణము, వశ్యము, ఉన్మాదకరము

తంత్రరాజే – మదన, ఉన్మాదన, మోహన, దీపన, శోషణములు

కాళికా పురాణే; హరషణము, రోచనము, మోహనము, శోషణము, మారణము

శ్రీం దాహక:, హ్రీం తేజో, క్లీం ఆకర్షణ, సం శబ్ద:, సౌ: విద్యుచ్ఛక్తులను పెంచి ప్రణవ బీజములు బాణములుగా గలది యనియు తలంపనగును.

జీవజాలము యొక్క సుషుప్తి దశయందు ఆవ్యక్తియొక్క బుద్ధీంద్రియ క్రియాకారణ రూపమున దాని ముఖ్య ప్రాణమున లయించియుండును. జీవులన్నియు సుషుప్తి దశయండు ఉచ్చ్వాస నిశ్వాసముల చేయుచుండును.

ఇందు మనుజులు, గోవులు. పులులు. పిల్లులు . ఏనుగులు, ఎలుకలు మొదలగు 84 లక్షల జీవజాతుల యొక్క ఉచ్చ్వాస నిశ్వాసములను వైజ్ఞానిక దృష్ట్యా పరీక్షించిన ఒకే విధమున నుండవనుట సత్య దూరము కాదు. దీనికి కారణం ఆయావ్యక్తి బుద్దీంద్రియ వ్యాపారముల యొక్క వాసనయేయగును.

సర్వ సాధారణముగా సుషుప్తికాలిక ప్రాణమునందు 5 భాగములు ఉండును. ఇవియే పంచ తన్మాత్రలు అనబడును. జీవుల క్రియా విశేషములన్నియు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు,5 ప్రాణములు, మనో-బుద్ది-చిత్త-అహంకారములు అనబడే 19 తత్వముల ద్వారా జరుగుచుండును. ఇది సర్వసాధారణము. ఇది సమిష్టి సూక్ష్మశరీరం అనబడును.

సృష్టి యందలి జీవజాలమున అల్పము, అల్పాల్పములగు జీవులకూ 19 అంగముల సూక్ష్మ శరీరము ఉండక పోవచ్చును. ఏవో ఒకటి లేదా రెండుతత్వములు మాత్రమే ఉండవచ్చును. ఈ 19 యందును మూల భూతములగు ఐదింటిని పంచ తన్మాత్రలు అందురు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని వాని సంజ్ఞలు.

వీనిలోని సత్వాంశలు వ్యష్టిగా జ్ఞానేంద్రియ పంచకం అనబడును. శ్రోత్ర, త్వక్, నేత్ర, రసన, ఘ్రాణములని వీని సంజ్ఞలు. ఈ సత్వాంశల సమిష్టియే అంత:కరణం అనబడుచున్నది. ఇందు కర్త్రుత్వాంశమనియు కరణత్వాంశమనియు రెండు అవాంతర భేదములు కలవు.

పంచతన్మాత్రలయొక్క వ్యష్టి రాజసాంశలు వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అను సంజ్ఞలు గల కర్మేంద్రియ పంచకమనబడును. ఈ ప్రాణము ఒకటిగానే తెలియబదడినను మెరక నుండి పల్లమునకు దిగునపుడును, పల్లమునుండి మెరక కెక్కునపుడును, ఆహారమును జీర్ణించునపుడును – జాగ్రత్ నించి సుషుప్తి లోనికి – సుషుప్తి నించి జాగ్రత్ దశలబొండునపుడు పంచవిధ కృత్యములు గలదై ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అను సంజ్ఞలు కలిగిఉన్నది.

ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఏక కాలీకములు అయ్యియు భిన్నములుగా తెలియబడుచున్నవి. ఎట్లన, మనము సంగీతము వినుచున్న, అదే కాలమున ఇంకొకరు పాడుచుండుట సంభవింపవలయును. ఈ రెండు ఏకకాలికం అగునపుడే సంగీతము వినుట అన్నది సంభవించును.

పాడువానిది కర్మేంద్రియ వ్యాపారము, వినువానిది జ్ఞానేంద్రియ వ్యాపారము. ఇట్లగుట సర్వ జన విదితము. పాడేడువాని కనువగు ప్రాణ భేదము పానం అనబడును. వినువాని ప్రాణభేదం అపానం అనబడును.

ఈ రీతినే మిగిలిన ఇంద్రియ వ్యాపారములకు వ్యాన, ఉదానమను ప్రాణభేదములు తెలియవగుచున్నవి. ఈ మొత్తానికీ కారణం పంచాతన్మాత్రలనబడును.

ఇవి జీవ సృష్టికి పూర్వమే ఉండియుండుట పంచభూతములను సార్ధక సంజ్ఞ కలిగిఉన్నవి. వీని సూచకములైన పంచ సాయకములను పరమేశ్వరి తన కుడిపై హస్తమున ధరించియుండి పంచతన్మాత్ర సాయకా అనబడుచున్నది.

జీవి యొక్క పూర్వకృతకర్మ వాసనలన్నియు ఈ పంచతన్మాత్ర సాయక రూపమున ఉండును. జీవి కర్మానుభవ కాలమున పరమేశ్వరి ఎవరికర్మల ఫలములను వారికే యథాన్యాయముగా అనుభవింపచేయును.

ఈ పంచ తన్మాత్ర నామము యొక్క భావార్ధము నెరింగి ఉపాసించువారు ముముక్షత్వమును పొందగలరు. ఈ చతుర్బాహు విధానమును భారతీయ విజ్ఞానానుసారము అవగాహన చేసికొనుటయే సాధనా చతుష్ఠయ సంపత్తి సంజ్ఞ గలది. దీని పరిణత దశయే ముముక్షత్వం అనే పరమ పురుషార్ధము. భారతీయ విద్య వలన కలుగునగు పరమ ప్రయోజనము.

కళ్యాణ శ్రీకళా యంత్రము నందలి 4.1.8 సంఖ్యలచే సూచితమైన త్రికోణ భాగమే పంచతన్మాత్ర సాయక సూచితము.

16. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా

పరమేశ్వరి తన కాంతిమండల ప్రభచే బ్రహ్మాండములను ముంచి వేయుచున్నది. చిదగ్ని కుండమునుండి పరమేశ్వరి ఆవిర్భవింప నుండగానే తత్కారణ ప్రభ ఉజ్జతపూర్యసహస్రమయ్యేను.

ఇప్పుడు పరమేశ్వరి మూర్తి నిర్గతములగు అరుణ తేజ:పుంజంచే బ్రహ్మాండాలన్నియు ముంచివేయబడుచుండుట వర్ణించ బడుచున్నది.

నామము నందలి నిజారుణ అను పదము వలన విమర్శ రూపిణి యగు పరమేశ్వరి యొక్క శరీర రక్తిమ స్వతః:సిద్ధమే గాని ఆదిత్యుని వలన గాని, అగ్ని కుండమువల్ల గాని ప్రాప్తించినది కాదు అని సూచింప బడుచున్నది.

ప్రపంచమునండలి సకల కాంతికారక పదార్ధములన్నియు పరమేశ్వరి నుండియే కాంతిని పొందుచున్నవి గాని పరమేశ్వరికి కాంతి నొసంగగల పదార్ధం ఇతరమేదియును లేదు. పరమేశ్వరి స్వయం ప్రకాశ.

నామము నందలి మజ్జద్ అను పదమువల్ల బ్రహ్మాండ మండలముకన్న పరమేశ్వరి కాంతిమండలము అధిక వ్యాప్తి కలది అగుట సూచింప బడుచున్నది.

మనము చీకటి యందు ఏదేని వస్తువును చూడదలిచిన వెలుతురు సహాయము కావలయును. ఆ వెలుతురు మనము చూడదలిచిన వస్తువుకన్న ఎక్కువ పరిధి కలది కాకుండిన వస్తువును పూర్తిగా చూడలేము. ఇది సర్వ జన విదితము. అట్లే బ్రహ్మాండ మండలమును ముంచి వేయుచున్న పరమేశ్వరి శరీర దీప్తి మండలము బ్రహ్మాండ మండలము కన్న గొప్పది అని తెలియనగుచున్నది.

పరమేశ్వరిని అరుణ మూర్తిగా ధ్యానించుట సర్వజగద్వశ్యకరము అని తెలియుచున్న్నది.

“స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వ ! లౌహిత్యం తద్విమర్శ: స్యాదుపాస్తి రితి భావనా!! స్వ-తంత్ర

కళ్యాణ శ్రీ కళా యంత్రము నందలి 3.1. 6.2 సంఖ్యలచే నిర్దేశింపబడిన మండలము బ్రహ్గ్మాండమండల సూచకము. దీనినే లోకతారా మండలం అనియు, హిరణ్య గర్భ మండలం అనియు అనుట గలదు, సర్వజీవ సూక్ష్మ శరీర రూపమే హిరణ్య గర్భ రూపము. స్వస్తి.

గ్రంధం – శ్రీలలితా రహస్యనామ సహస్ర గూఢార్థ దీపిక రచయిత – శ్రీ కళ్యాణానందనాథ దీక్షా నాములు శ్రీరాచకొండ వేంకట కోటేశ్వరరావు సంకల్పం- శ్రీకలిగోట్ల శర్మగారిది తేదీ – 28 జూలై 2018

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page