నారాయణీయం-09
నారాయణభట్టాత్రికృత నారాయణీయం-09
శివాయగురవేనమః
శ్రీకాశికాతీర్థానందనాథాయనమః
(వ్యాఖ్యానం-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు)
(దశకం-1.4)
ఎన్నో జన్మల సుకృతంగా గురువాయుపురంలో కంటి ఎదురుగా గోచరించే పరబ్రహ్మస్వరూపం శ్రీమన్నారాయణుడు. ఆయనే భాగవత కథావస్తువు, భాగవత ప్రతిపాద్యమైన శ్రీకృష్ణపరబ్రహ్మం. ఆ స్వామి తత్త్వాన్ని చెప్పుకుంటున్నాం.
సచ్చిదానందఘనము, అద్వితీయము, కాలదేశవస్తు పరిమితులకు అతీతము, నిత్యముక్తము, వేదాలచే బహుధా కీర్తింపబడేది, చూసినంత మాత్రాన స్పష్టంకానిది అంటే కేవలం అనుభవానికి మాత్రమే అందేది. ఉత్తములైన యోగులు, సాధకులైనవారు, జ్ఞానులైనవారు మాత్రమే అందుకునే పరతత్త్వం అది.
జ్ఞానులకు మాత్రమే అందే మోక్షపురుషార్థమే అయితే మరి సామాన్యులకు ఎలా? అనే ప్రశ్న అక్కర్లేదు. జ్ఞానులు బహుసాధనలతో అత్యంతకష్టసాధ్యంగా అందుకునే పరబ్రహ్మము, అనేక జన్మల భాగ్యం వల్ల అత్యంత సులభంగా గురుపవనపురంలో మనకనుల ఎదుట గోచరిస్తున్నది.
బుద్ధిశక్తి, ప్రాణశక్తి సంచరించే శరీరమే గురువాయుపురం. అందులో ఉన్న అప్ప నారాయణుడే పరబ్రహ్మము. ఆ బ్రహ్మమును గోచరింపజేసుకోవాలి. శరీరమనే పరిమితిలో ఉన్నంత మాత్రాన అది పరిమితికి లోబడినట్లు కాదు. అపరిమైతమైన పరబ్రహ్మవస్తువును గోచరింపజేయడమే భాగవతము ఉద్దేశం.
భాగవతకారుడైన వేదవ్యాసుడు ప్రథమ శ్లోకములో అదే చెప్పారు. నిరస్త కుహకం - తన అపూర్వమైన దివ్య తేజస్సుతో మాయను తొలగించువాడు, దేశకాలావధిభ్యాం నిర్ముక్తం, పునరురు పురుషార్థాత్మకం అంటే అర్థం అదే. మాయను తొలగించడమే మోక్షము. ఆ మోక్షమే నారాయణతత్త్వము. అదే సత్యం, దానిని ధీమహి - ఉపాసిస్తున్నాను.
తత్తవద్భాసి - తత్ తావత్ భాసి - ‘అది అలాగే ఇక్కడ గోచరిస్తున్నది’ అన్నారు. తత్ అంటే నిఘంటుపరంగా ‘అది’ అని అర్థం. కాని ‘తత్’ అంటే బ్రహ్మవాచకము. తత్ పదలక్ష్యార్థ - ‘తత్’ అనే పదానికి అర్థం పరబ్రహ్మము. గాయత్రీమంత్రం ‘తత్’ శబ్దంతో ప్రారంభమౌతుంది.
‘తత్ తావత్’ అనే వాక్యం ‘పరం ధీమహి’ అనే భాగవత ప్రథమశ్లోకంలో చెప్పిన గాయత్రీస్వరూపాన్ని దర్శింపజేయడానికి ‘తత్’ శబ్దాన్ని నాలుగవపాదంలో చెప్పారు నారాయణ భట్టపాదులు. ఆ పరబ్రహ్మతత్త్వము తన పరబ్రహ్మలక్షణాన్ని ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్ణంగా ప్రకటిస్తూ శ్రీకృష్ణునిగా గోచరిస్తున్నది. అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే సాక్షాత్తు గురువాయపురాధీశుడు అని ప్రతిపాదిస్తూ.. అలాంటి పరబ్రహ్మముగా దర్శిస్తూ, ఉపాసిస్తున్నాను అన్నారు.
భాగవతం భాగవతధర్మమైన భక్తిని తెలియజేస్తోంది. నారాయణ భట్టాత్రి నారాయణీయం వ్రాయడానికి మూలవస్తువు భక్తి. భాగవతంలో ప్రతిపాదించబడిన వస్తువును గురించి వ్యాసభగవానుడు చెప్తూ
ధర్మప్రోజ్ఝిత కైతవోsత్రపరమో నిర్మత్సరాణాం సతాం
వేద్యం వాత్సవ మత్ర శివదం తాపత్రయోన్మూలనమ్
శ్రీమత్ భాగవతే మహామునికృతే కింవా పరైరీశ్వరః
సద్యోహృద్యవరుధ్యతేsత్ర కృతిభిః శుశ్రూషిభిః స్తత్ క్షణాత్
ధర్మప్రోజ్ఝిత కైతవః అంటే మోసంలేని ధర్మం ఇందులో చెప్పబడుతుంది అన్నారు. మోసము అంటే కపటము. కపటము లేని ధర్మము అంటే కేవల ప్రేమపూర్వకమైన భక్తి. భక్తిలో కపటము ఉండదు. మనస్సులో ఒకటి ఉంచుకుని బయటకు వేరొకటి మాట్లాడితే కపటం. నిర్మలమైన మనస్సును భగవంతుని ముందు పరచడమే భక్తి. ప్రేమయే భక్తి. ఆ ప్రేమలో ఎటువంటి వ్యాజమూ, వ్యాపారమూ లేదు.
నిర్మలమైన పరాభక్తే భాగవతంలో వస్తువు కనుక ధర్మప్రోజ్ఝిత కైతవః అని చెప్పారు. కపటము లేని ధర్మమే భక్తి. ఆ భక్తే తాపత్రయోన్మూలనమ్ - సమస్త తాపాలను తొలగింపజేస్తుంది. అది వేద్యం - తెలుసుకోదగింది. నిగమసహస్రేణ నిర్భాస్య మానమ్ - వేదాల ద్వారా తెలియబడే తత్త్వమే ఇది అన్నారు. భాగవతం కూడా దీనినే చెప్పింది. ఈ రహస్యాన్నే భాగవతకారుడు చెప్తూ
నిగమకల్పతరోర్గళితం ఫలం
శుకముఖాదమృతద్రవ సంయుతమ్
పిబతభాగవతం రసమాలయం
ముహురహో రసికా భువి భావుకాః
అన్నారు.నిగమకల్పతరోర్గళితంఫలం - వేదాలనే కల్పవృక్షము నుండి రాలిపడిన ఫలము భాగవతం అన్నారు. వృక్షసారమంతా ఫలంలో ఉంటుంది. వృక్షమును ఆస్వాదించదలుచుకుంటే వృక్షాన్ని తినం. దాని ఫలాన్ని తింటాం. అలాగే వేదంలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే భాగవతాన్ని ఆస్వాదించాలి. భక్తియే వేదము యొక్క సారవస్తువు. భాగవతమే వేదము యొక్క సారవస్తువు. ఆ వేదసారవస్తువే నారాయణుడు. భాగవత మధురవస్తువే నారాయణుడు. వ్యాసుడు చెప్పిన ‘నిగమకల్పతరోర్గళితంఫలం’ అనే దానిని ‘నిగమశతసహస్రేణనిర్భాస్యమానమ్’ అనే దాని ద్వారా నారాయణ భట్టపాదులు చెప్పారు.
అదే విధంగా పరతత్త్వానికి రెండు విధాలైన లక్షణాలు భాగవతంలో చెప్పారు - ఒకటి స్వరూప లక్షణం. రెండవది తటస్థ లక్షణం. స్వరూపలక్షణం ఆయన స్వభావాన్ని తెలియచేసేది. పరమాత్మ సచ్చిదానందమయుడు అనేది స్వరూపలక్షణము. సృష్టి స్థితిలయకారకుడు అని చెప్పడాన్ని తటస్థలక్షణం అంటారు.
అంటీ, అంట కుండా తన పని తాను చేసుకుపోతే దానిని తటస్థం అంటారు. ఆ తటస్థలక్షణం పరమేశ్వరునకు ఉంది. తటము అంటే ఒడ్డు. స్థ అంటే ఉండుట. తటస్థలక్షణం అంటే ఒడ్డున ఉండువాడు అని అర్థము. ఒడ్డు ఉండడం వల్లే దానిని ఆధారం చేసుకుని ప్రవాహము పరుగెడుతుంది. కాని ప్రవాహంతోపాటు ఒడ్డు కూడా పరుగెత్తడం లేదు. ఒడ్డు అక్కడే ఉంది. అలాగే సృష్టిస్థితిలయలన్నీ ఆయన వలననే నడుస్తున్నాయి. కానీ ఆయన మాత్రం తటస్థంగా, సాక్షీభూతంగా ఉన్నాడు. దీనినే తటస్థలక్షణం అంటారు.
‘దేశకాలావధిభ్యాం నిర్ముక్తం’ లేదా ‘కాలదేశావధిభ్యాం నిర్ముక్తం’ అనే మాటలో తటస్థ లక్షణాన్ని చెప్పారు. దీనినే భాగవతంలో ‘జన్మాద్యస్య యతః’ అంటే సృష్టిస్థితిలయలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో లేదా దేనినుండి జరుగుతున్నాయో అని చెప్పారు.
సృష్టి స్థితి లయలు విశ్వానికి సంబంధించినది. ఈ విశ్వమంతా దేశకాల పరిమితులకు లోబడి ఉంది. ‘దేశకాలావధిభ్యాం’ అన్నప్పుడు సృష్టిస్థితిలయలు మూడూ చెప్పి, ఆయన నుండి ఇవన్నీ వచ్చినప్పటికీ ఆయన వీటికీ అంటడం లేదు కనుక తటస్థలక్షణాన్ని ‘నిర్ముక్తం’ అని చెప్పారు. పరమాత్మ యొక్క స్వరూపలక్షణం, తటస్థలక్షణం రెండూ ఇందులో ప్రతిపాదించారు.
‘అస్పష్టం దృష్టమాత్రే’ అంటే కేవలము బాహ్యదృష్టికి భగవంతుడు గోచరించడు అని చెప్పడం. మనము క్షేత్రానికి వెళితే అక్కడున్నది కేవలము విగ్రహమే. అయితే పెద్దవారు చెప్పారు కనుక చాలా గొప్పది, దాని వల్ల ఏదైనా మహిమ జరుగవచ్చు. మహిమ జరిగితే గొప్పది లేకపోతే గొప్పదికాదు. ఇది మన యొక్క దృష్ట మాత్రే - పై చూపుతో నిర్ణయించేది. కానీ పరతత్త్వం అంటే అది కాదు. ఎవరు దృష్టిలో వారు చూస్తారుగాని అది మాత్రమే కాదు పరతత్త్వం. ఈ విషయాన్ని అన్నమాచార్య చక్కగా చెప్పారు.
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
పిండి కొద్దీ రొట్టెలా ఎవరు ఎలా భావిస్తే, పరమాత్మ అలా గోచరిస్తాడు. కానీ పరమాత్మ అసలు తత్త్వం అఖండమైన సచ్చిదానందమయం. ‘ఇదియే పరతత్త్వము మాకు’ అంటారు అన్నమాచార్య. నేను ఆశ్రయించిన గురువాయుపురాధీశుడైన శ్రీకృష్ణుని ‘ఇదియే పరతత్త్వం’ అని ఆశ్రయిస్తే తప్పకుండా మోక్షం ఇస్తాడు.
ఒకే శ్లోకంలో గురువాయూరప్ప తత్త్వాన్ని, భాగవతహృదయాన్ని చెప్పారు. అందుకే ఈ దశకం పేరు భగవత్తత్త్వము అని చెప్పారు.
ఇది ‘పునరురుపురుషార్థకం’ అంటే కేవల కైవల్యస్వరూపం, మోక్షము. భాగవతం ఉద్దేశమే మోక్షము. అది మోక్షగ్రంథము. కర్మబంధనాల నుండి విమోచనంచేసి కైవల్యానందం ప్రసాదించడానికి పుట్టిన భక్తిశాస్త్రం, మోక్షశాస్త్రం. కైవల్యం కోసమే భాగవతాన్ని పట్టుకోవాలి. ఈ విషయాన్ని పోతనగారు భాగవతంలో మొదటిలోనే చెప్పారు.
శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.
నందాంగనాడింభకుడు అంటే యశోదాపుత్రుడైన శ్రీకృష్ణపరమాత్మ. ఆయనను కైవల్యపదమైన మోక్షానికై ఆశ్రయిస్తున్నాను. ఆ మోక్షమే నారాయణస్వరూపం కనుక ‘ఉరుపురుషార్థాత్మకం’ అని చక్కగా నిక్షిప్తం చేశారు. అదే బ్రహ్మతత్త్వము. ఆ బ్రహ్మతత్త్వం కృష్ణుడై గురుపవనపురంలో ఉన్నాడు.
దేశకాలపరిమితులకు అతీతమైనపుడు ఆయన గురువాయుపురంలో ఉన్నాడని ఎలా చెప్పారు? గురువాయుపురంలో ఉన్నాడు అంటే దేశపరిమితి, కాలపరిమితి వచ్చేసింది కదా! అంటే దేశకాల పరిమితులకు అతీతమైనప్పటికీ కూడా మనలను అనుగ్రహించడానికి ఒక దేశపరిమితిలో గోచరిస్తున్నాడు.
‘హన్తభాగ్యం జనానాం!’ - మన అదృష్టం వల్ల అలా ఒకపరిమితికి లోబడినట్లుగా కనిపిస్తున్నాడు అంటే అందని వస్తువు అందినట్లు గోచరిస్తున్నది. అదే కొనసాగింపుగా తరువాత శ్లోకంలో అత్యద్భుతంగా చెప్తున్నారు.
ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్త లభ్యే యదన్య
స్తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటైవమ్
ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మాన మేనం గురుపవనపురాధీశమే వాశ్రయామః
సర్వం శ్రీనారాయణార్పణ మస్తు