నారాయణీయం -08
నారాయణభట్టాత్రికృత నారాయణీయం -08
శివాయగురవేనమః
శ్రీకాశికాతీర్థానందనాథాయనమః
(వ్యాఖ్యానం-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు)
(దశకం -1.1) - భాగవతానికి, నారాయణీయగ్రంథానికి ప్రధానమైన వస్తువైన శ్రీకృష్ణబ్రహ్మము ఎలా ఉందో వర్ణిస్తున్నారు. అతడే గురువాయుపురంలో వెలసి కవికి సాక్షాత్కరిస్తున్నాడు. ఆ లక్షణము - సాంద్రానందావబోధత్మకము, అనుపమితం, కాలదేశవధిభ్యాంనిర్ముక్తం, నిత్యముక్తం, నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అని చెప్పారు. అనంతములైన వేదాలచే ప్రతిపాదించబడేది ఆ తత్త్వం.
‘వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే ఆది నేనెరుగ దగిన ఆ దైవమును’ అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ. ఈ విషయాన్నే అన్నమాచార్య తన కీర్తనలో తెలియచేశారు.
వేదపురాణములలో విహరించే దైవము
ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము,
శ్రీదేవి పాలిట చెలగే నిధానము
సేదతీరి యశోదకు శిశువాయెనిదిగో
పరమపురుషుడు గోపాలబాలుడైనాడు
మురహరుడు ఎదుటా ముద్దుగారె నిదిగో
అని వర్ణిస్తాడు. ఆ తత్త్వమే ఇక్కడ చెప్తున్నారు.
నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం - అనంతములైన వేదాలచేత, అనంత విధాలుగా ప్రకాశింపబడిన పరబ్రహ్మము. వేదములు ఎంత చెప్పినప్పటికీ కూడా అస్పష్టం. అది స్పష్టము కానిది. ఎంత చెప్పినా స్పష్టము కాకపోతే ఎందుకండీ... అనడానికి వీలులేనిది . అది ఎలాంటీదో ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.
హిమాలయ పర్వతాలు చూసినవారు ఆ ఆనందానుభూతిని మరొకరికి వాటిని వర్ణిస్తూ చెప్తున్నప్పుడు విన్నవారు అవునా..! అంటే ఎంత చెప్పినా నీకు తెలీదులే... చూడవలసిందే అంటారు. అవునా.. లేదా? అతను ఎంత చెప్పినా అది ఒక అవగాహనను ఇవ్వగలదే కానీ పూర్ణమైనది అనుభవానికి మాత్రమే తెలుస్తుంది.
వేదములంటే ఏమిటి? మాటలు. మాటలెంత వరకు తెలియజేస్తాయి? మనలను అనుభవానికి ప్రేరేపింపజేసి, అందులో ప్రవేశింపజేయడం వరకే. అనుభవంతో మాత్రమే తెలియబడేది. అస్పష్టం అనడంతో కేవల అనుభవైక వేద్యము.
'ఈ లాగున వివరింపలేను చాల స్వానుభవైక వేద్యమే అప్పా! రామ భక్తి యెంత గొప్పదిరా?'
అంటారు త్యాగరాజస్వామి. ఈలాగున వివరింపలేను - అది ఇలాంటిదని చెప్పలేనయ్యా! చాలా స్వానుభవైకవేద్యం. అది అనుభవైకవేద్యమైన వస్తువు. పరబ్రహ్మానందానుభవం అనేది ఏ జీవికి, ఆ జీవి తన సాధనతో, తపస్సుతో అనుభవించవలసిన వస్తువే. దాని వైపు ప్రేరేపించేలా తన అనుభవాన్ని చెప్పగలడుకానీ, తన అనుభవాన్ని పూర్ణంగా చెప్పలేడు. ఈ విషయాన్నే నారదుడు భక్తిసూత్రాలలో 'మూకాస్వాదనవత్' అని చాలా చక్కగా చెప్పాడు.
ఒక తీయని పదార్థాన్ని మూగవానికి పెట్టి, ఎలా ఉంది నాయనా..? అని అడిగితే వాడు చెప్పడానికి ఎంతో అవస్థ పడతాడో, అలా వేదాలు కూడా చెప్తూ ఉన్నప్పటికీ అస్పష్టం అన్నారు. అలాంటి అస్పష్టమైన వస్తువు గురువాయుపురంలో స్పష్టమైంది. ఎలాగంటే ఒక అర్చావతారమూర్తిగా ఎదురుగా కనబడింది. మనం వెళ్ళి దర్శిస్తున్నాం. అలా దర్శించే విగ్రహం మామూలుది కాదయ్యా..వేదాలు కూడా వర్ణించడానికి వీలులేని అస్పష్టతత్త్వం ఎదురుగా విగ్రహరూపంలో ఉంది.
అందువలనే దృష్టమాత్రే - ఈ విగ్రహాన్ని చూస్తే చాలయ్యా.. 'పునరురుపురుషార్థాత్మకం' - అది చూస్తే మనకు వచ్చే ఫలితం – ఉరుపురుషార్థాత్మకం అని చెప్పారు. పురుషార్థము లెన్ని? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని నాలుగు విధాలు. ఉరు అంటే ఉత్కృష్టమైనది, గొప్పది అని అర్థం. మొత్తం పురుషార్థాలలో గొప్పది నాలుగవ పురుషార్థం. అది ఉరుపురుషార్థం. అంటే మోక్షపురుషార్థం. ‘పునరురుపురుషార్థాత్మకం దృష్టమాత్రే పునః’ - దానిని దర్శించడంచేత లభించే ఫలం కైవల్యము. అంటే గురువాయూరప్పను చూస్తే లభించేది కైవల్యము.
వేదాలకు కూడా అందని నారాయణబ్రహ్మము కైవల్యము ఇవ్వడానికి గురువాయుపురంలోకి వచ్చి వెలిశాడయ్యా..! ‘ఆ సచ్చిదానందఘనమైన బ్రహ్మవస్తువే గురువాయుపురంలో గురువాయురప్పగా నా ఎదురుగా కనిపిస్తున్నాడ’ని పరవశించి చెప్తున్నారు నారాయణభట్టపాదులు.
ఆయనను చూస్తే చాలు మోక్షం వస్తుంది. కాదు..కాదు... ఆయనే మోక్షము. విష్ణువు అంటే మోక్షం ఇచ్చేవాడు కాదు. మోక్షము వేరు, మోక్షమిచ్చేవాడు వేరు కాదు. మోక్షమే విష్ణువు. విష్ణువే మోక్షం. అన్ని బంధాలు వీడి పరమానందంలో లీనమవడమే మోక్షము. ఆ పరమానందం వేరు, విష్ణువు వేరు కాదు. పరమానందమే విష్ణువు. తనను తానే ఇచ్చుకుంటాడు ఆయన.
మోక్షమిచ్చాడంటే అర్థం - తనను తాను ఇచ్చుకున్నాడు నారాయణుడు. ఉరుపురుషార్థాత్మకం - తానే కైవల్యస్వరూపుడు. తానే మోక్షస్వరూపుడు. మోక్షం అంటే కైవల్యం. అది తప్ప మరొకటి లేని స్థితిని పొందగలగడమే మోక్షం. ఆ బ్రహ్మతత్త్వమే ఉరుపురుషార్థాత్మకం అన్నారు. ఆ బ్రహ్మతత్త్వమే అక్కడ గోచరించిందని ఆయన లక్షణాలన్నీ చెప్పారు.
అస్పష్టం దృష్టమాత్రే అనేమాటకు - వేదాలద్వారా ప్రకాశింపబడినప్పటికీ, కేవలము వేదవాక్యాల ద్వారానే దొరకడు. నాయమాత్మా ప్రవచనేన లభ్యః - మాటలవలన ఆత్మతత్త్వము దొరకదని ఉపనిషత్తు చెప్పింది. కొందరు అస్పష్టం దృష్టమాత్రే అనేమాటకు వేరే అర్థం చెప్పారు. అస్పష్టం దృష్టమాత్రే అంటే చూసినంత మాత్రాన స్పష్టముకానిది అని కూడా అర్థము. అంటే సాధారణంగా మనం వెళ్ళి గురువాయూరప్పను దర్శించాం. బాగా దర్శనమైందా? అంటే అయిందని చెప్తాం. అది మనకు దర్శనం.
కానీ అసలు దర్శనం ఏమిటి.. మనం చూసే విగ్రహం సాక్షాత్తు ఇన్ని లక్షణాలతో ఉన్న బ్రహ్మతత్త్వము అని తెలిస్తే వెంటనే ఆనందిస్తాం. ఇదియే బ్రహ్మము నాకు అంటారు. అటువంటివారే నిజంగా దర్శించగలరు.
మనకు దొరుకుతున్న ప్రమాణాల ద్వారా అన్నమాచార్య మాత్రమే వేంకటేశ్వరుని పూర్ణంగా చూడగలిగాడు. ఇంకా అలాంటివారు ఎందరో చూసి ఉండవచ్చు కానీ అన్నమయ్య చూశాడు అనడానికి ఆయన గ్రంథాలే ఆధారం. ఆయన వేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ఇదియే బ్రహ్మము అని దర్శించాడు.
'పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటిరాయడా
అని దర్శించాడు. ఓ పురుషోత్తమా...! నిన్ను దర్శించాం. నీవెవరివి? అంటే
కోరిమమ్మునేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా
గారవించి దప్పితీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా'
అన్నమయ్య వేదవేద్యమైన పరతత్త్వమే వేంకటేశ్వరుడు అనే అనుభూతి పొందాడు. అది నిజమైన దర్శనము. మామూలుగా చూచినంత మాత్రాన అసలైన దర్శనం అందరికీ కలుగదు.. కానీ నారాయణభట్టపాదులకు ఆ దర్శనం కలిగింది. ఇదియే బ్రహ్మతత్త్వమని స్పష్టమైనది. ఎందువలన? భాగ్యము వలన. అనేక జన్మలభాగ్యం వల్ల ఆ గురువాయూరప్ప తాను బ్రహ్మతత్త్వమనే భావాన్ని ఆయనకు స్పష్టము చేశాడు. తన యొక్క భాగ్యం వల్ల అలా స్పష్టం చేసుకున్నాడు. ఆ బ్రహ్మతత్త్వమే కైవల్యస్వరూపమై, మోక్షస్వరూపమై కనబడుతోంది. ఆయనను దర్శించడమే నాకు మోక్షము. మరేమీ అక్కర్లేదని ఆ పూర్ణబ్రహ్మతత్త్వాన్ని గురువాయుపురంలోనున్న గురువాయూరప్ప ద్వారా అనుభూతిలోకి తెచ్చుకున్నారు.
ఆ బ్రహ్మతత్త్వము తత్తావద్భాతి సాక్షాత్ నాకు నేరుగా కనిపిస్తున్నదయ్యా..
ఆ కైవల్య స్వరూపము, ఆ సచ్చిదానందఘనపదార్థము నా ముందు కనిపిస్తోంది అని కీర్తించారు.
ఈ శ్లోకానికి ఇంకా చాలా వ్యాఖ్యానం ఉంది. నిజానికి నారాయణీయం భాగవతం స్వరూపం అన్నప్పుడు ఆ భాగవతాన్ని రచించిన వ్యాసదేవుడు ఎంత ఉదాత్తమంగా ఆ గ్రంథాన్ని ప్రారంభించారో, అంత ఉదాత్తముగా ఇది ప్రారంభింపబడాలి. అప్పుడే ఇది గొప్ప గ్రంథం అవుతుంది.
వ్యాసుడు భాగవతం ఎలా ప్రారంభించారో గమనిస్తే....
భాగవతం కూర్పు చాలా గొప్పది. అది కేవలం విష్ణు కథల సమూహంకాదు. విష్ణుకథ అంటే పరబ్రహ్మతత్త్వము. విష్ణువు అంటే ఎవరో కాదు. సాక్షాత్తు పరబ్రహ్మ. నారాయణుడే బ్రహ్మము. బ్రహ్మమే నారాయణుడు. ఆ బ్రహ్మమును తెలియజేసే బ్రహ్మసూత్రాలను వ్యాసదేవుడు రచించాడు. ఆ బ్రహ్మసూత్రాలలో ఏది ఉందో, భాగవతంలో కూడా అదే చెప్పబడుతున్నది. గాయత్రీమంత్రస్వరూపమే భాగవతం అని మత్స్యపురాణం చెపుతున్నది. భాగవతం బ్రహ్మసూత్రాల హృదయం అని చెప్పడానికి వ్యాసదేవుడు స్పష్టంగా భాగవత మొదటి శ్లోకంలోనే తెలియజేశారు.
'జన్మాద్యస్య యతోऽన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్
తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః
తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోऽమృషా
ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి'
సత్యం పరం ధీమహి’ అనే దానిలోనే గాయత్రీస్వరూపం ఉంది. మహాత్ములు ఏదైనా ఒక మహామంత్రాన్ని ఈ విధంగా నిక్షిప్తం చేస్తారు. అంతేకానీ, మంత్రాన్ని కావ్యంలో, పురాణంలో యథాతథంగా చెప్పకూడదు. మంత్రాలను బహిరంగంగా చెప్పడం అనేది మహాపాతకానికి హేతువు అవుతుంది. ఋషి అయినవాడు మంత్రాన్ని నిక్షిప్తము చేసి చెప్తాడు. సంప్రదాయం తెలిసినవాడు చేస్తాడు. అంతేకాని మంత్రాలను పాటలుగా పాడి వినిపించడం, మంత్రాలను బహిరంగంగా చెప్పడం సంప్రదాయం కాదు.
అందుకే వ్యాసదేవుడు గాయత్రీమంత్రంలోని ‘ధీమహి’ అనే శబ్దాన్ని అందులో పెట్టి అది గాయత్రీహృదయం అన్నారు- సత్యంపరంధీమహి. ‘ఏదైతే వరేణ్యమైన భర్గము ఉన్నదో అదే సత్యము, అది పరం. అది నారాయణ పరబ్రహ్మము. దానిని నేను ఉపాసిస్తున్నాను’ అని అర్థము. ఈ ‘సత్యం పరం ధీమహి’ అని వ్యాసులువారు రచించిన భాగవతములో ప్రథమశ్లోకంలోని భావాన్ని నారాయణీయంలో ప్రథమశ్లోకంలో నిక్షిప్తం చేశారు నారాయణభట్టపాదులు.
‘సత్యం పరం ధీమహి’ అనే దానినే ‘బ్రహ్మతత్త్వము’ అనే దానిలో చెప్పారు. ‘సాంద్రానందావబోధాత్మకం’ అనడమే ‘సత్యం పరం.’ ఈ సత్యం పరం అయిన ఆ తేజస్సు ఎలాంటిది? అంటే ధామ్నాస్వేనసదా నిరస్తకుహకం.
నిజానికి జన్మాదస్య యతోన్వయాది అనే శ్లోకానికి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆ ఒక్క శ్లోకాన్ని కొన్ని నెలలపాటు వ్యాఖ్యానించుకోవచ్చు. అందులో చెప్పబడింది బ్రహ్మతత్త్వం.
జన్మాదస్యయతః అంటే సృష్టిస్థితిలయలు అన్నీ ఎవరివలన కలుగుతున్నాయో అతడు. ఆయన స్వరాట్ - తనంత తాను ప్రకాశించేవాడు. తన ప్రకాశంచేత బ్రహ్మదేవునకు వేదాలు ఇచ్చినవాడు. ముహ్యంతి యశ్శూరయః శూరులు కూడా ఆయన గురించి పూర్ణంగా తెలుసుకోలేక మోహితులు అవుతున్నారు. శూరులు అంటే పండితులు, ఋషులు అని అర్థము. ఋషులు అంటే తపస్సుచేత పరబ్రహ్మమును తెలుసుకోవాలని ప్రయత్నించేవారు. నిజానికి ఋషులు అంటే వేదమంత్రాలు. శూరయః అంటే వేదమంత్రాలు. వేదమంత్రాలు బ్రహ్మవిషయంలో ముహ్యంతి - పూర్ణంగా చెప్పలేవు. ‘నిగమశతసహస్రేణనిర్భాస్యమానం అస్పష్టం’ అనే మాట ‘ముహ్యంతి యశ్శూరయః’ అనే మాటకు వ్యాఖ్యానం.
అలాగే శూరయః అంటే భక్తులు అని అర్థం. నిత్యశూరులు అని వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు. ఆ శూరులు ముహ్యంతి – మోహితులు అవుతున్నారు? ఎవరి విషయంలో మోహితులు అవుతున్నారంటే నారాయణుని విషయములో. మోహితులవడం అంటే అర్థం దానిపై మరులుకొనుట, మక్కువ కొనుట. భక్తులైనవారు నారాయణబ్రహ్మవిషయంలో మక్కువ కొంటున్నారు. భాగవతం కనుక భక్తులని తెలియజేస్తున్నారు. ఆ దివ్యమైన సచ్చిదానంద ఘనపదార్థమే శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు, గురువాయుపురాధీశుడు.
సర్వం శ్రీమన్నారాయణార్పణ మస్తు.