నారాయణీయం -06
నారాయణభట్టాత్రికృత నారాయణీయం -06
శివాయగురవేనమః
శ్రీకాశికాతీర్థానందనాథాయనమః
(వ్యాఖ్యానం-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు)
స్వామివారి అవతారాలు అనేకం ఉన్నాయి. వాటిలో కళావతారాలు, అంశావతారాలు, ఆవేశావతారాలుగా కొన్ని చెప్పబడుతున్నాయి. పూర్ణావతారంగా చెప్పబడుతున్నది శ్రీకృష్ణావతారం. కొందరు శ్రీకృష్ణునిది నారాయణుని అవతారం కాదు సాక్షాన్నారాయణుడే ఆయన అని చెప్తారు. మిగిలిన అవతారాలు శ్రీకృష్ణుడు ఎత్తాడు అంటే ఒప్పుకుంటాంకానీ, శ్రీకృష్ణునిది మాత్రం అవతారం అంటే ఒప్పుకోరు. నారాయణుడే కృష్ణుడు కనుక నారాయణీయము అంటే కృష్ణుని కథ అని అర్థము.
విష్ణువు కథలన్నీ చెప్పినా భాగవతం ప్రతిపాదించే వస్తువు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే పరబ్రహ్మము. శ్రీకృష్ణుడే భగవానుడు అని ప్రతిపాదిస్తుంది. భాగవతంలో ఇతరములైన అవతారాలు చెప్పినా శ్రీకృష్ణావతారమే ప్రథమ ప్రయోజనం, ప్రధానము కూడా. అంటే ఇన్ని అవతారాలు కూడా కృష్ణావతారంలోనే విలీనమై ఉన్నాయి అని చెప్పడం భాగవతకారుడైన వ్యాసమహర్షి ఉద్దేశము, శుకమహర్షి ఉద్దేశము. ఆ ఉద్దేశాన్ని గ్రహించినవాడు మహోపాసకుడైన నారాయణ భట్టపాదులు.ఆయన కూడా గురువాయూరప్పను శ్రీకృష్ణునిగా దర్శిస్తున్నాడు.
కేరళలో ఉన్నవారంతా గురువాయూరప్ప నారాయణుని కేవలం శ్రీకృష్ణస్వరూపంగానే ఆరాధిస్తూ ఉంటారు. నారాయణుడే భగవానుడు, ఆయనే స్వయంగా శ్రీకృష్ణుడు. పరిపూర్ణమైన అవతారం కృష్ణావతారం. నారాయణుని ఏ విశుద్ధమైన పరబ్రహ్మతత్త్వం ఉందో, ఆ పరబ్రహ్మతత్త్వాన్ని ప్రకటించిన అవతారము కృష్ణావతారం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. నారాయణుని పరమాత్మ లక్షణాన్ని పరిపూర్ణంగా ప్రకటించిన అవతారము శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణుని నారాయణీయంలో కీర్తిస్తున్నారు.
శ్రీకృష్ణగ్రంథమైన భాగవతమే నారాయణీయము. భాగవతస్వరూపం, భాగవతసారం, భాగవత వ్యాఖ్యానం, భాగవత సంగ్రహం - శ్రీమన్నారయణీయ గ్రంథము. ఇది చెప్పేటప్పుడు తాను చదివిన భాగవతాన్ని తిరిగి చెప్పడం కాకుండా, ఆ భాగవతాన్ని తాను అనుభూతి పొంది, ఆ అనుభూతిని స్వయంగా తాను పరమాత్మతో వ్యక్తము చేస్తున్నారు. ఆత్మానుభూతిని పరమాత్మతో వ్యక్తం చేయడం ఇందులోని దివ్యలక్షణం.
ఏది భగవానుడికి వినిపిస్తాడో, అది విశ్వానికి వినిపించినట్లే. విశ్వరూపుడే విష్ణువు. విష్ణువుకు వినిపించేవాడే నిజానికి విశ్వానికి వినిపించగలడు. అంతేకానీ విశ్వానికి వినిపిద్దామని తాపత్రయపడితే దానివల్ల ప్రయోజనం లేదు. విష్ణువుకు వినిపించే మాటే విశ్వానికి వినిపిస్తుంది. విశ్వమంతా విష్ణుమయం కనుక ఎవరు భగవంతునితో మొరబెట్టుకుంటారో, వారి మొరకు విశ్వము ప్రతిస్పందిస్తుంది.
ఈ నారాయణీయ గ్రంథాన్ని నారాయణ భట్టపాదులు సాక్షాత్తు విష్ణువుకే చెప్తున్నాడు. వక్త నారాయణ భట్టపాదులనే భక్తుడైతే... శ్రోత సాక్షాన్నారాయణుడు. అందువలన కూడా ఈ శ్లోకాలకు గొప్ప మహిమ సమకూరింది. అటువంటి దివ్యమైన నారాయణీయం ప్రారంభమౌతున్నది. ఇందులో ప్రతి అక్షరానికి నమస్కరిస్తూ ప్రథమశ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం.
నారాయణీయం నూరు దశకాల గ్రంథం. దశకం అంటే పది శ్లోకాలు ఉంటాయి. కొన్ని దశకాలలో ఒకటి/ రెండు శ్లోకాలు ఎక్కువ, తక్కువలు కూడా ఉండవచ్చు. కానీ ప్రధానంగా దశకంగా ఒకొక్క భాగాన్ని వర్ణించారు. నారాయణీయం నూరు దశకములు - వెయ్యి ముప్పై ఆరు శ్లోకాల గ్రంథం.
ప్రథమదశకంలో భగవత్ తత్త్వనిరూపణం జరుగుతున్నది. భగవత్తత్త్వం అంటే.. ఇది భాగవతం కదా..! భాగవతమంటే అర్థం ఏమిటి? భాగవతము పేరు ఎలా పెట్టబడిందో, నారాయణీయం పేరు అలా పెట్టబడింది. భగవంతునికి సంబంధించింది భాగవతం. ఆ భగవంతుడు నారాయణుడు కనుక నారాయణునకు సంబంధించింది నారాయణీయం. ఆ పేరు అంత చక్కగా పెట్టారు.
భగవత్తత్త్వాన్ని ప్రతిపాదిస్తూ మొత్తంగా భాగవతం దేనిని తెలియజేస్తున్నదో, దానిని ప్రథమశ్లోకములోనే చూపిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన మరో విశేషము శ్రీకృష్ణుడు పరిపూర్ణావతారము. ఆ పరిపూర్ణావతారం గురువాయుపుర క్షేత్రంలో అర్చావతారంగా ఉన్నది.
భగవానుడు కొన్ని క్షేత్రాలయందు ఒక దేవతాస్వరూపంగా వెలసి ఉంటాడు. అలా వెలసిన స్వరూపాన్ని అర్చావతారం అంటారు. తిరుమలపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి నారాయణుని అర్చావతారం. అదేవిధంగా గురువాయుపురంలో వెలసిన గురువాయూరప్ప కూడా నారాయణుని అర్చావతారం. ఇవి అర్చావతారములని విష్వక్సేనసంహిత చెప్తున్న విశేషం. అర్చావతారమైన గురువాయుపురాధీశుని మనసా నమస్కరిస్తూ, ఆ స్వామి దివ్యతత్త్వాన్ని ఆవిష్కరించే ప్రథమ శ్లోకాన్ని స్మరించుకుందాం.
సాంద్రానందావబోధాత్మక మనుపమితం దేశకాలావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణనిర్భాస్యమానం
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం (1-1)
ప్రథమ శ్లోకము, ప్రధాన శ్లోకము. ఎప్పుడైనా ప్రథమమే ప్రధానము. ఒక మహా వృక్షం ఉందంటే దానికి మొదలు ఏది? విత్తనమే మొదలు. విత్తనంలోనే వృక్షమంతా ఉంటుంది. అదేవిధంగా భాగవతం యొక్క ప్రధానవస్తువును ఈ ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని క్షుణ్ణంగా అర్థము చేసుకుంటే భాగవతమంతా అర్థమైనట్లే, నారాయణుడూ అర్థమైనట్లే, శ్రీకృష్ణుడూ అర్థమైనట్లే, అసలు వేదమే అర్థమౌతుంది.
ఈ నారాయణుడు ఎవరు? అంటే బ్రహ్మతత్త్వం అని చెప్తున్నారు. తన ఎదురుగా తాను చూస్తున్న గురుపవనపురాధీశుడైన నారాయణుడు సాక్షాత్తు బ్రహ్మతత్త్వము. అంటే పరబ్రహ్మస్వరూపుడు. పరబ్రహ్మ అంటే ఏమిటో తెలుసుకుంటే భారతీయమైన వేదాంతహృదయం అంతా తెలిసినట్లే. పరబ్రహ్మమంటే ప్రధానంగా సచ్చిదానందమయము.
సత్-చిత్ఆనందఘనం వస్తువు ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మము అనేదానికి ఇక్కడ ఒక పేరు, రూపము చెప్పబడడం లేదు. నిర్గుణమైన ఒక మహాతత్త్వము పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే మనలను అనుగ్రహించడానికి సగుణసాకారంగా గురుపవనపురంలో వెలసింది అని చెప్తున్నారు నారాయణీయకర్త. ఆ పరబ్రహ్మమే భాగవతప్రతిపాద్యవస్తువైన నారాయణుడు, శ్రీకృష్ణుడు అనేది హృదయం.
ఆ పరబ్రహ్మ యొక్క ఏడు లక్షణాలు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించుబడుతూ ఉన్నాయి. ఇవి అర్థమైతే పరబ్రహ్మ అర్థమౌతాడు. మనం దేవుడు, దేవుడు అంటూ ఉంటాం. దేవతలందరు కూడా ఆ పరబ్రహ్మము నుండి వచ్చినవారే. ఆ పరబ్రహ్మము అనేది దైవం అనే మాటకు అసలు అర్థం. ఆ పరబ్రహ్మ అంటే ఏమిటో స్పష్టంగా తెలియజేస్తున్నారు.
1.సాంద్రానందావబోధాత్మకం, 2. అనుపమితం, 3. కాలదేశావధిభ్యాం నిర్ముక్తం, 4. నిత్యముక్తం, 5. నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం, 6.అస్పష్టం, 7. దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం - ఇక్కడి వరకు లక్షణాలు చెప్పి, ఇన్ని లక్షణాలతో కూడుకున్న ఆ బ్రహ్మతత్త్వము ఎక్కడ కనిపిస్తోంది? తత్తావద్భాతి సాక్షాత్ - సాక్షాత్ అంటే నేరుగా ఎదురుగా అని అర్థం. ఈ బ్రహ్మతత్త్వం ఇదిగో నా ఎదురుగా కనిపిస్తున్నది. ఎక్కడ? గురుపవనపురే - పవనము అంటే వాయువు. గురుపవనపురే - అంటే గురువాయుపురంలో కనిపిస్తున్నది. ఎందువల్ల కనిపిస్తోంది? నేను చూడడం వల్ల కనిపిస్తోందా..! కాదు. ఇది కేవలం అనేక జన్మల సుకృతం వలన కనిపిస్తున్నది అన్నారు.
హంత భాగ్యం జనానాం - ఒక్క నాకే కనిపిస్తోందా..? ఎందరెందరో వచ్చి దర్శించి తరిస్తున్నారే...! అలా దర్శించాలంటే దానికి కావలసింది ఏమిటి..? భాగ్యం. మనకు కనబడని మహాఫలానికి భాగ్యం అని అనేకజన్మల సుకృతం వలన ఉద్భవించేదానికి భాగ్యం, అదృష్టం అంటారు. జనానాం జనుల యొక్క అదృష్టం వల్ల, హంత అన్నారు - హంత ఆశ్చర్య వాచకం. ఆహా..! అనడం. హంత భాగ్యం జనానాం – జనుల యొక్క ఆశ్చర్యమైన భాగ్యం వలన ఈ గురుపవనపురంలో నారాయణుడు కనిపించాడు. ఆహా... ! అని ఎందుకన్నారంటే అది మామూలు భాగ్యం కాదు - అనేక జన్మల విశేషభాగ్యము, అత్యద్భుతమైన భాగ్యము. అద్భుతమైన భాగ్యము ఉంటేకానీ ఆ నారాయణుని దర్శనము లభించదు.
అయితే దర్శనం లభించడం అంటే అర్థం ఏమిటి? చాలామంది టికెట్లు కొనుక్కుని క్యూలో వెళ్ళి ప్రత్యేక దర్శనం చేసేవారు ఉంటారు. వారంతా భాగ్యవంతులేనా..? అంటే అది కూడా భాగ్యమే. అందులో సందేహం లేదు. భగవంతుని సన్నిధికి వెళ్ళడం, ఆయనను దర్శించడం - ఏదైనా భాగ్యమే కానీ, తాను చూస్తున్న గురుపవపురాధీశుడైన నారాయణుడు సాక్షాత్తు బ్రహ్మతత్త్వం అని దర్శించడం ఏదైతే ఉందో అది భాగ్యం. ఈ భాగ్యం ఎవరికి లభిస్తోందో వారు ధన్యులు. అటువంటి వారిని చూచి హంతా! - ఆహా! అనుకోవాలి.
పరమేశ్వరుడు సులభప్రసన్నుడు. ఎవరికీ అందని ఆ పరమాత్మ మనలను అనుగ్రహించడానికి అర్చావతారుడై అక్కడ వెలసి ఉన్నాడు అని చెప్తున్నారు. అర్చావతారుడై వెలసిన గురువాయూరప్ప పరబ్రహ్మతత్త్వం అని చెప్పడం ఒకటి, తాను చెప్పబోతున్న నారాయణీయమునకు కథానాయకుడైన నారాయణుడు, శ్రీకృష్ణుడు పరబ్రహ్మతత్త్వము అని చెప్పడం ఒకటి. ఈ రెండు ఉద్దేశాలను దీనిలో నెరవేర్చుతున్నారు నారాయణభట్టపాదులువారు.
మొదటిగా మనం తెలుసుకొనవలసింది సాంద్రానందావబోధాత్మకం. ఈ ప్రథమశ్లోకం శార్దూల ఛందంలో ప్రారంభం అవుతున్నది. ఇందులో ‘సాంద్రానం’ అనే మాటలో మూడు గురువులు చెప్పబడ్డాయి. మూడు గురువులతో కావ్యము ప్రారంభించడం అనేది దివ్యమైన సంప్రదాయం. ఇది మంగళకరమైన గణము. సాంద్రానం అనే దివ్యశబ్దం. ‘సాం’ అన్నప్పుడు దానిలో ఒక నాదం ఉంది.
బ్రహ్మతత్త్వం ఎటువంటిదంటే సాంద్ర-ఆనంద-అవబోధాత్మకం. సాంద్రానందం అంటే ఆనందమయమైనది అని చెప్పడం. ఎటువంటి ఆనందం? సాంద్రానందం. సాంద్రము అంటే చిక్కనైన అని అర్థం. చిక్కనైన ఆనందం. పలచబడిన ఆనందము కాదు. మనం ఏవేవైతే లోకంలో ఆనందాలు అనుకుంటున్నామో అవేవీ కూడా నిజములైన ఆనందాలు కావు. పలుచబడిన ఆనందాలు. అవి మిథ్యానందాలే సత్యానందాలు కావు. ఏది నిజమైన ఆనందం? ఏది పరబ్రహ్మవస్తువో అదే నిజమైన ఆనందం. అది సాంద్రానందం, చిక్కనైన ఆనందం. చిక్కదనము అంటే పరిపూర్ణత.
పరిపూర్ణము, చిక్కదనము సత్ అనే దానిని తెలియజేస్తుంది. సాంద్రము అనే మాటలోనే సత్ అనే పదార్థాన్ని చూపించారు నారాయణభట్టపాదులవారు. సాంద్రానందము అంటే సదానందము అని కూడా. పరిపూర్ణ ఆనందము, సదానందము. ఈ ఆనందము ఎటువంటిది? అవబోధాత్మకం. బోధ అంటే జ్ఞానం. అవబోధ అంటే పూర్ణజ్ఞానము. సాంద్రానందము, అవబోధము. ఈ రెండూ కలసింది ఆ బ్రహ్మతత్త్వం.
సాంద్రానందము అంటే సదానందం. అవబోధాత్మకం అంటే చిత్ అని అర్థము. చిత్ అంటే చైతన్యము, పూర్ణజ్ఞానము అని అర్థము. సాంద్రానందావబోధాత్మకం అంటే సత్-చిత్-ఆనందమయము అని ప్రస్తావించడం. ఆ సచ్చిదానంద బ్రహ్మతత్త్వం గురించి మిగిలిన విషయం తరువాత చెప్పుకుందాం. స్వస్తి.
సర్వం శ్రీనారాయణ చరణారవిందార్పణమస్తు.