top of page

‘నంది శివుని వాహనం, నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడు

నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడు..

💐శ్రీనంది కొమ్ముల మధ్య నుండి శివదర్శనం చేయునపుడు పఠించవలసిన శ్లోకము..!!

వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వర స్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్యా కైలాసం భవతి ధృవం ఓం నమః శివాయ.!

శివుడు.. ఈ పేరు వింటే పార్వతి, గంగ, నాగేంద్రుడు గుర్తుకొస్తారు. అలాగే మరోపేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అదే నంది.’నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్లినా నందిని తీసుకువెళ్తాడు’. ఇది మనందరికీ తెలిసిన విషయమే.

అయితే అసలు నందికి.. కైలాసంలో శివుడితో పాటు ఉంటూ..

శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది?. అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే.

పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో.. శివుడ్ని తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు.

శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్లపాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు.

శిలాద భక్తికి మెచ్చిన శివుడు.. శిలాద ముందు ప్రత్యక్షమై ‘శిలాద’ అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్లుతెరిచి చూశాడు.

కళ్లెదుట సాక్ష్యాత్తూ శివుడే ఉండటంతో.. ‘శిలాద ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన మాటలు ఆనందబాష్పాల రూపంలో బయటికి వచ్చాయి.

శివుడు శిలాద వైపు చూస్తూ.. ‘నీకేం వరం కావాలో కోరుకో శిలాద’ అనడిగాడు.

అప్పుడు శిలాద ‘స్వామి.. నాది ఒకే ఒక కోరిక.. నాకు పిల్లలు లేరు..నాకో బిడ్డను వరంగా ప్రసాదించు’ అని అడిగాడు. శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో.. నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.

‘ఓ వైపు శివుని దర్శనం.. మరోవైపు శివుని వరం’. ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడ్ని, శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు.

మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్లి.. పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు.

ఇంతలో ‘శిలాద.. ఆ బిడ్డని తీసుకెళ్లి.. పెంచి, ప్రయోజకుడ్ని చేయి’ అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి.

ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు, ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు.

శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగుపెట్టడంతో.. శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి.

కొన్నేళ్ల తరువాత.. మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాధరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు.అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు.దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి..వీరు ఇక్కడున్నంత కాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు.

నంది.. తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు.

రెండు రోజుల తరువాత.. ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటినుంచి బయలుదేరారు.

వారు వెళ్తూ శిలాదని, నందిని దీవించారు. ముందుగా శిలాదని ‘ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు’ అని దీవించారు.

అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ.. ‘జాగ్రత్తగా ఉండు.. నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచిపేరు తీసుకురా’ అని దీవించి వెళ్లిపోయారు.

నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద..వారి వెనుకే కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారిముందు నిల్చొని ఆయాసపడుతూ ‘మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు?.. ఏదైనా జరగరానిది జరుగనుందా?’ అనడిగాడు.

అప్పుడు మిత్ర.. శిలాద వైపు బాధగా చూస్తూ ‘నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను’ అన్నాడు.

ఆ మాట విని శిలాదకి ఏం అర్థంగాక ‘నా కుమారుడికి ఏం జరగబోతుంది’ అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి.. ‘నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది.. కానీ చెప్పక తప్పడంలేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు’ అని చెప్పాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది.

ఇన్నిరోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు.సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడినుంచి లేచి..గుండెనిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు.

నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్ధమై కంగారుగా ‘ఏమైంది నాన్న’ అనడిగాడు.శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ..

‘సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా?’ అనడిగాడు.శిలాదకి ఏం అర్థంగాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది.. ‘నాన్న.. నువ్వు శివుడ్ని చూశానని చెప్పావు. శివుడ్ని చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు.నిజంగా నేను మరణించాలని రాసుంటే.. ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్పదేవుడు ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తున్నాం..మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా?’ అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది ‘నన్ను దీవించండి నాన్న’ అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు

శిలాద ‘విజయోస్తు’ అని దీవించాడు.

నంది భువన నదికి వెళ్లి భక్తి శ్రద్దలతో శివుడ్ని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు.నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై.. నంది ‘కళ్ళు తెరిచి చూడు’ అన్నాడు.నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు.

శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి.. గుండెల్లో బందీ చేసుకున్నాడు.అలా శివుడ్ని చూస్తూ.. ఆయన్ని అడగడానికి ఏం లేదు. ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు.

అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ.. ‘నంది.. నీ భక్తి నన్ను ఇంతదూరం తీసుకొచ్చింది. నీకేం వరం కావాలో కోరుకో’ అనడిగాడు. నంది తనకి తెలియకుండానే ‘స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది’ అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి.. ‘నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది.

నీ ముఖం ఎద్దులా మారితే.. నువ్వు నాతోపాటు కైలాసంలో ఉండొచ్చు. నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా, స్నేహితుడిలా ఉంటావు’ అని అన్నాడు. నంది ఆనందబాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు.

అప్పటినుంచి నంది శివుడికి వాహనంలా, గణాలకు అధిపతిగా మారిపోయాడు. ఓం నమః శివాయ..!!

🌺🙏🙏🙏🙏🙏🌺

1 view0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page