top of page

దానశీలం

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 హృదయపూర్వకంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇవ్వడమన్నది మహోన్నత లక్షణం. ఈ సంస్కారం ప్రేమ నుంచి జనిస్తుంది. దీన్ని త్యాగమని, దానమని చెబుతుంటారు. దానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. దీని వల్ల భగవానుడు సంతుష్టి చెందుతాడని భగవద్గీత చెబుతోంది.

వందమందిలో ఒక శూరుడు జన్మిస్తాడు. వెయ్యిమందిలో ఒక పండితుడు పుడతాడు. లక్షమందిలో ఒక వక్త ఉదయిస్తాడు. శరణాగతుల కోరికలు తీర్చగల దాత పుడితే పుడతాడు, లేకపోతే లేదు- అని ఓ సంస్కృత సుభాషితానికి అర్థం. ఉదార గుణం అలవడితే చాలు, వర్ణనాతీతమైన బ్రహ్మానందాన్ని ఆ దాత అనుభవిస్తాడు. ఏది దానం చేయాలన్నా మొదట శ్రద్ధ ఉండాలి. వినయంతో, జ్ఞానంతో, యోగ్యత తెలిసి దానమివ్వాలని తైత్తిరీయోపనిషత్తు పేర్కొంటుంది. కంకణాది భూషణాల వల్ల కాదు, దానం వల్లనే చేతులు ప్రకాశిస్తాయని భర్తృహరి అంటాడు. జీవితాంతం చేస్తూనే ఉండాల్సినవి స్వాధ్యాయం, జపం, దానం అని నీతిశాస్త్ర కథనం. అనుగ్రహం, దానబుద్ధి కలిగి ఉండటమే సచ్ఛీల లక్షణాలని మహాభారతం విశదీకరిస్తుంది. ‘దానం కోసమే ధనార్జన చేయాలి’ అంటారు శంకర భగవత్పాదులు. వ్యాధుల నుంచి ఉపశమనానికి- ఔషధ సేవనంతో పాటు జప హోమాలు, దానం ఉపకరిస్తాయన్నది పెద్దల మాట. దాన పరీక్షలో బలి చక్రవర్తి గెలిచాడు. దానశీలత కాపాడుకోవడంలో సఫలుడై, అక్షయ పుణ్యఫలం పొందగలిగాడు. కర్ణుడు తన కవచ కుండలాల్ని ఇంద్రుడికి ఇచ్చి ‘దాన కర్ణుడు’ అనిపించుకున్నాడు. మనుషులకే కాదు- ప్రకృతిలోని వృక్ష, పశు పక్ష్యాది జీవజాలానికి, జంతువులకు సేవ చేయడమూ దానమే!

శిబి చక్రవర్తి ఓ పావురాన్ని కాపాడటానికి, డేగకు తన శరీరంలోని మాంసఖండాన్ని కోసి ఇచ్చాడు. కల్పవృక్షం కంటే గొప్ప దాత నల చక్రవర్తి అని ఒక కావ్య వర్ణన. ఇంద్రాగ్ని యమ వరుణులు ‘అర్థులమై వచ్చాం, మమ్మల్ని ఆదరించు’ అని కోరారు. అర్థి అనే మాట చెవికి సోకినంతనే నలుడు పులకించి, ఏది కావాలన్నా ఇస్తానన్నాడట. నిజమైన దాత మనసు అంత నిర్మలంగా ఉంటుంది.

దానంచేసిన వ్యక్తిని ‘సాక్షాత్తు దేవుడిలా వచ్చి ఆదుకున్నా’వని కొనియాడతారు. నిర్లక్ష్యంతో చేసిన దానం, ఇచ్చినవాణ్నే నాశనం చేస్తుందని రామాయణం హెచ్చరిస్తుంది. ‘దానం మహత్కార్యం’ అని వర్ణించారు వ్యాస భగవానులు. కరవు కాటకాలు, వరదలు సంభవించిన ప్రదేశాల్లో ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా, నిస్వార్థంగా చేసే దానాన్ని ‘సాత్విక దానం’ అంటారు. వివిధ ఒత్తిళ్లకు లోనై, బాధపడుతూ ఇచ్చేది- రాజస దానం. ఆదరాభిమానాలు చూపక, తృణీకార భావంతో అహంభావంతో అపాత్రులకు చేసేది- తామస దానం అని పెద్దలు వర్గీకరించారు.

దానం చేయడానికి సంకోచించేది మానవుడే! వృక్షాలు, నదులు అనేక ప్రాణుల సుఖం కోసం ఎంత దానం చేస్తున్నాయో! మనిషి ఏ కొంచెమో దానం చేస్తే- ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటాడు. ఆ కుసంస్కారం పోవాలి. దానం అనేది ఓ వ్రతం, ఓ యాగం, ఓ దీక్ష, ఓ తపస్సు. అలా భావించి ఆచరించాలని భారతీయ ఆర్ష సంస్కృతి బోధిస్తుంది.

ఇతరులకు చేతనైనంత సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంటుంది. చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. దానాన్ని మక్కువతో, మనస్ఫూర్తిగా, గుప్తంగా ఇవ్వాలి. నలుగురి మెప్పు కోసం కాదు. అన్న, విద్య, ధాన్య, వస్త్ర, గృహ, ధన దానం వంటివి అనేకం ఉన్నాయి. దేవాలయానికి వెళ్లే ముందే దానం చేసి వెళ్లాలని, ఆ పుణ్యకార్యానికి పరమాత్మ సంతోషిస్తాడని పురాణగాథలు చెబుతాయి. మనుషులమై పుట్టినందుకు, దానశీలత అనే సంస్కారాన్ని ఆచరణలో పెట్టడమే కాకుండా, రేపటి తరాలకూ దాని విలువను తెలియజేయాలి!

– చిమ్మపూడి శ్రీరామమూర్తి 🙏🙏🙏

🌺🙏🙏🙏🙏🙏🌺

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page