top of page

ఆరా వర్షాలు.. Six Color importance

ఆరా వర్ణాలు:

సంగీతంలో స్వరాలు ఉంటాయి. శ్రావ్యంగా వినిపించే ధ్వని తరంగాలని ’స్వరాలు’ అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని శబ్ధాలు కర్ణకఠోరంగా ఉంటాయి. అట్లాంటి శబ్ధాల్ని వదలిపెట్టి శ్రావ్యతను తమలో నింపుకున్న స్వరాలను ఇతర మంచి స్వరాలతో కలిపి మంచి సంగీతాన్ని సృష్టించడాన్ని స్వరకర్తలు నిరంతరం కృషి చేస్తూంటారు.

సంగీతంలో మనకు వినిపించే స్వరాలలాగే కనిపించే కాంతిలో కూడా వర్ణాలుంటాయి, వినిపించే ధ్వని, కనిపింఛే కాంతి రెండూ తరంగ రూపాంతరాలేనని మనం తెలుసుకొవాలి. కొన్ని రంగులు మనల్ని ఉత్తేజితుల్ని చేసి సంతోష పెడ్తే మరికొన్ని వర్ణాలు మనకు తిక్కపుట్టిస్తాయి; ఉద్వేగాన్ని కోపాన్ని ప్రేరేపిస్తాయి. మానవుని ఆరాలో అనేక రంగులు కలబోసుకుని ఉంటాయని మనం తెలుసుకున్నాం. మన కంటికి కనిపింఛే వర్ణాలకు మాత్రమే పేర్లున్నాయి. మన కంటి చూపు పరిధిలోకి రాని లేక దాటిపొయే కాంతి మిశ్రమాలకు మనం పేర్లు పెట్టాలేం. వాటికి పరారుణ కిరణాలు అనీ, అతి నీలలోహిత కిరణాలు అనీ గుంపుగా సమిష్టిగా నామాలతో ఉదహరించి అనుకుంటాం తప్ప ప్రత్యేక పేర్లు చాలా రంగుల మిశ్రమాలకి లేవు. మన చెవులకి విన్పించకుండా కుక్కలకి మాత్రం వినిపించే శబ్ధాలను పుట్టించగల ’ఈల’ గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. అలాగే కుక్క చెవులకు ఏ మాత్రం వినిపించని శబ్ధాలను మన చెవులు గ్రహించగలుగుతున్నాయి. శబ్ధతరంగాలని ఓ అంచులో కుక్కలు వినగలుగుతూ ఉంటే, మరో అంచులోని కొన్ని భాగాలను మనం వినగలుగుతున్నాం. మన చెవులు వినగలిగే శబ్ధతరంగాల విస్తీర్ణాన్ని మనం పెంచుకోగలిగామనుకోండి, అప్పుడు మనకు ’కుక్క ఈల’ శబ్ధం స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే కంటికి కనుపించే కాంతి తరంగాల విస్తీర్ణాన్నీ మనం పెంచుకోగలిగితే మనకి మానవ శరీరం చుట్టూ ఉన్న ’ఆరా’ స్పష్టంగా కనిపించి తీరుతుంది. ఇలాంటి దృక్కును సంపాదించడానికి మనం చేసే సాధన సవ్యంగా సాగకపోతే మనం నల్లరంగు, డీప్ పర్పుల్ రంగుల్ని కూడా చూడలేని స్థితికి మన కన్ను చేరుకుంటుంది! కాబట్టి, ’ఆరా’ (కాంతి వలయం)ను చూడటానికి మనం చేసే ప్రయత్నాల్ని జాగ్రత్తగా, ఓర్పుతో చేయవలసి ఉంటుంది.

అన్ని రంగుల మిశ్రమాలను చర్చించుకోవడంలో అర్థం లేదు. ముఖ్యమైన ప్రాథమిక ఏడు రంగుల గురించి మాత్రం ఈ పాఠం లో చర్చించుకుందాం. ఓ వ్యక్తి యొక్క ’ఆర’ను మనం గమనిస్తున్నాం అనుకోండి. ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే ఆ వ్యక్తి ’ఆరా’లోని రంగులు క్రమేపీ ఓ పద్ధతిలో మార్పు చెందటాన్ని మనం గుర్తించవచ్చు. దురద్రుష్టవశాత్తు ఓ వ్యక్తి పరమపద సోపానాలు ఎక్కుతూ… క్రిందికి జారిపోతే ఆ వ్యక్తి ఆరలోని ప్రాధమిక రంగు పూర్తిగా మారిపోవచ్చు లేదా రంగు సాంద్రత తగ్గిపోయి పేవలంగా తయారవచ్చు. సప్త ప్రాధమిక వర్ణాల్లో ఓ వ్యక్తి ఆరాలోని ఓ రంగు ప్రాముఖ్యంగా గోచరిస్తుంది. మిగతా అనేకానేక వర్ణ మిశ్రమాలు ఆ వ్యక్తి ఆరాలో ఇంధ్రధనస్సు రంగులు సుడిగుండాల్లో చిక్కుకున్నట్టు గిర్రున తిరుగుతూ ప్రవహిస్తూ కనిపిస్తాయి. శరీరం చుట్టూ ఈ రంగుల కలువలు వర్తులాకారంలో వేగంగా పరుగులు తీస్తుంటాయి. అలాగే తల నుంచి పాదాల వరకు జలపాతంలా పడూతూ వుంటాయి. మనకు ఇంద్ర ధనస్సులో కనిపించే ఏడు రంగుల కన్నా చాలా ఎక్కువ రంగుల మిశ్రమాలు ఈ ఆరాలో మనకు దర్శనమిస్తాయి. నీటి బిందువుల కాంతి పరావర్తనం వల్ల ఏర్పడేదే ఈ ఇంధ్రధనస్సు. ఈ ప్రక్రుతి దృశ్యం చాలా సులభంగా ఏర్పడుతుంది. అలాగే ’ఆరా’ అనేది ప్రాణానికి పూర్తి ప్రత్యామ్నాయం’ అని తెలుసుకొండి.

ఈ క్రింద కొన్ని రంగుల గురించి విశ్లేషణ ఇవ్వబడింది. మిగతా రంగుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎంచేతనంటే ముందు ఈ క్రింది వర్ణాలను మనం గ్రహించగలిగినప్పుడే మిగతా విషయాల గురించి తెలుసుకోవాలనే కోరిక మీకు ఏర్పడాలి. ఈ రంగులు మీరు చూడగలిగే రోజు వచ్చేవరకూ మిగతా రంగుల గురించి మరచిపోండి.

ఎరుపు:- ఎరుపు ఓ మంచి రంగు, బలమైన జీవితానికి ఇది ఓ సంకేతం. గొప్ప సైనికాధికారుల ఆరాలో ఎర్రరంగు విశేషంగా గోచరిస్తుంది. పసుపు రంగు అంచులు కలిగి ఉన్న మంచి ఎరుపు రంగును తన ఆరాలో పొందు పరచుకున్న వ్యక్తి ఇతరుల యోగక్షేమాల కోసం నిరంతరం పాటుపడి పోరాటం చేయాలనుకునే తత్త్వాన్ని కలిగి ఉంటాడు. అందరి అంతరంగిక విషయాల్లోకి అనవసరంగా కల్పించుకుని దూరే వ్యక్తితో పై వ్యక్తిని పోల్చుకోకండి. ఇలాంటి నక్షత్రకుల ఆరాలలో ఉండేది ఎర్రరంగు కాదు బ్రౌను (కాఫీ పొడి రంగు) రంగు మాత్రమే. ఓ శరీరం లోంచి ఎర్రటి కాంతి పుంజాలు వెలువడుతూంటే ఆ శరీరాంగాల ఆరోగ్యం చాలా బాగా ఉన్నట్టు అర్థం. చాలా మంది. ప్రపంచ నాయకుల ఆరాల్లో ఈ ఎర్రటి రంగుతో బాటు కాలుష్యపు రంగులు కూడా తోడు కావటం నిజంగా శోచనీయం.

బురద రంగు తోడయిన ఎరుపు రంగు కానీ, బాగా ముదిరి ఉన్న పసుపు రంగు కానీ ఓ వ్యక్తి యొక్క దుర్మార్గాన్ని కాఠిన్యాన్నీ ఘోషించి వెల్లడిస్తుంది. అటువంటి రంగు ఆరా గల వ్యక్తిని మనం నమ్మడానికి వీలులేదు. అతను నిరంతరం ’జగడాలమారి’గా ఉంటాడు. భయంకర మైన స్వార్థాన్ని తనలో నింపుకుని, మోసంతో జీవిస్తూ తన స్వంత పబ్బం గడుపుకునే వ్యక్తిగా అతనిని మనం గమనించవచ్చు. పాలిపోయిన ఎరుపు రంగు ఉత్తేజం పొందిన నాడీ మండలంలో అలజడిని సూచిస్తుంది. “మా చెడ్డ” ఎరుపు రంగు ఆవరించి ఉన్న మనిషి శారీరకంగా బాగా బలవంతుడయి వుంటాడు. హంతకుల ’ఆరా’లు అధోగతికి చెందిన ఎరుపు రంగుని కలిగి ఉంటాయి. ఎరుపు రంగు ఎంత తేలికగా ఉంటే… ఆ వ్యక్తి అంతగా నెర్వస్ గా ఉంటాడు; అంతగా నిశ్చలతను కోల్పోయి ఉంటాడు. అలాంటి వ్యక్తి ఉద్రేకంతో ఉరకలు వేస్తూంటాడు. ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాడు; కొద్ది క్షణాలు కూడా నిశ్చలంగా ఉండలేడు. అలాంటి వ్యక్తి తప్పక స్వార్థపరుడై వుంటాడు. శరీరాంగాల దగ్గిర ఎర్ర రంగు కనిపిస్తే ఆయా అవయవాల ఆరోగ్యాన్ని ఆ రంగు తెలుపుతూ ఉంటుంది. నిర్జీవంగా కనిపించే ఎరుపు గానీ, మట్టిరంగు కలిసిన ఎరుపుగానీ, ఓ ప్రదేశంలో నెమ్మదిగా ఊగిసలాడుతూ కనిపిస్తే అక్కడ కేన్సర్ వ్యాధి వృద్దిపొందుతోందని గ్రహించవచ్చు. ఆ ప్రదేశంలో నిజంగా క్యాన్సర్ ఉన్నా లేక సమీప భవిష్యత్తులో అక్కడ ’కేన్సర్’ వృద్ది జరిగే అవకాశం ఉన్నా ముందే గుర్తు పట్టవచ్చు. ఆ భాగం లో వెలువడే ఎర్ర కాంతిని బట్టి రాబోయే జబ్బులను గురించి ముందుగానే గ్రహించవచ్చు. వెంటనే సరైన జాగ్రత్తలు వహించగలిగితే మంచి జరుగుతుంది. లేకపోతే రకరకాల వ్యాధులతో బాధపడటం తప్పదు. “ఆరా థెరపీ”ద్వారా రోగ నిరోధం సాధించడం లేక రోగాన్ని బాగుచేసుకోవడం – భవిష్యత్తులో సాధ్యం కావచ్చు. దవడ దగ్గర ఎర్ర రంగు మచ్చలాగా మెరుస్తూ కనిపిస్తే ఆ వ్యక్తి పంటి పోటుతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆత్మ విశ్వాసం అతిగా కలవారి ఆరాల్లో స్కార్లెట్ ఎరుపు కనిపిస్తుంది. వాళ్ళు తమని తాము ఇష్టపడుతూ ఉంటారు. ఈ రంగు వారి నిరతిశయానికి – లేని గొప్పతనానికి సంకేతంగా నిలుస్తుంది. వ్యభిచారం వృత్తిగా గల స్త్రీల పిరుదుల వద్ద కూడా ఇలాంటి రంగు కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఉన్న ’స్కార్లెట్ ఉమెన్’ అనే పేరు సార్థక నామధేయంగా గమనించండి. అటువంటి స్త్రీల లో సెక్సులో ఎటువంటి ఆనందం ఉండదు ధనార్జనే వారి ధ్యేయం. బ్రతుకు తెరువుకు అది ఓ పద్ధతి – అంతే దురహంకారి, పడుపుగత్తె మొదలైనవారు ఒకానొక ఎరుపు (స్కార్లెట్) వర్ణాన్ని ధరించి ఉంటారు. ఇంగ్లీషు భాషలో ఎప్పుడూ వాడే కొన్ని మాటల్లో – ఉదాహరణకి ’స్కార్లెట్ ఉమెన్’, ’బ్లూ మూడ్’, ’రెడ్ రేజ్’, ’బ్లాక్ విత్ టెంపర్’, ’గ్రీన్ విత్ ఎన్వీ’ ఆరా రంగులు స్పష్టంగా వాళ్ళు నిజంగా గమనించో, చూసో చెప్పినట్టుగానే మనకి అనిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యంలేదు.

ఎరుపు రంగు దగ్గిరే ఇంకా కొంత సేపు నిలబడదాం. పింక్ రంగు (సరిగ్గా పింక్ రంగు కాకపోయినా పగడాలరంగుకి కొంత దగ్గరగా ఉండే రంగు లాంటిది) పూర్తిగా ఎదగని శైశవాన్ని ప్రకటిస్తుంది. నవ యవ్వనవంతుల్లో ఈ రంగు ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో ఈ రంగు కనిపిస్తే అది వారి పిల్ల తరహా వ్యవహారాన్నీ, తమకి భద్రతలేదని అనుకునేవాళ్ళ మనస్తత్వాన్నీ సూచిస్తుంది. రెడ్ – బ్రౌన్ ఆరా వ్యక్తి చాలా నీచంగా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి రంగు ఆరా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మానుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు మనకు తప్పక కష్టాలు తెప్పించగలరు. ఈ రంగు ముఖ్యశరీర అవయవం మీద కనిపిస్తే భయంకరమైన జబ్బుతో వాళ్ళు బాధపడుతున్నారనీ, త్వరలోనే వాళ్ళకి మరణం సంభవిస్తుందని తెలుసుకోండి.

ప్రక్కటెముకల క్రింద ఎరుపు రంగు కనిపిస్తే వాళ్ళకి నరాల బలహీనత ఉందని అర్థం. ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. నాలుగు కాలాల పాటు సుఖ సంతోషాలతో జీవించాలని వారు కోరుకునేట్లయితే అది తప్పకుండా సాధ్యం.

ఆరెంజ్:- ఆరెంజ్ రంగు నిజానికి ఎరుపులో ఓ భాగమే. కానీ దానికో ప్రత్యేక స్థానాన్నిచ్చి గౌరవించడం ఎందుకంటే ప్రాచ్య దేశాల్లో ఆరెంజ్ రంగుని సూర్యుడికి చిహ్నంగా ఆరాధిస్తూ ఉంటారు కనుక. అక్కడ ఎక్కడ చూసినా వివిధ వర్ణాల ఆరెంజ్ రంగులు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ సూర్యునికి ఆరెంజ్ రంగుతో జతచేయబడుతూ ఉంటే మరికొన్ని దేశాల్లో సూర్యుడిని నీలిరంగుతో సమీకరించే పద్దతిని కొందరు ఆచరిస్తారు. ఈ రెండు పద్ధతులను ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలుగా చూపించడానికి ఈ ప్రస్తావన తీసుకువచ్చాం. మీ మతం ప్రకారం సూర్యుడిని ఏ రంగుతో అర్చించినా పర్వాలేదు. ఎటొచ్చి ఆరెంజ్ రంగు ఓ మంచి రంగు. తమ ఆరాల్లో తగిన ఆరెంజ్ కలిగిన వ్యక్తులు ఇతరుల పట్ల సానుభూతిని కలిగి ఉంటారు. వాళ్ళు మానవతావాదులు. దురదృష్టవంతులకి వాళ్ళు కొండంత అండగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పసుపు – ఆరెంజ్ మిశ్రమం తమ ఆరాలో ఉండాలని ఆశించడం ఉత్తమమైనది. ఎంచేతనంటే అట్లాంటి వర్ణాన్ని ఉండి ఉన్న వాళ్ళు ఆత్మ నిగ్రహాన్నీ చాలా ఇతర మంచి గుణాలనీ కలిగి ఉంటారు.

బ్రౌను – ఆరెంజ్ మిశ్రమం అథమమైన సోమరిపోతుని సూచిస్తుంది. ’దున్నపోతు మీద వర్షం’ అనే సామెత ఇలాంటి వ్యక్తులకే వర్తిస్తుంది. ఈ వర్ణం మూత్రపిండాల జబ్బుని ఎత్తి చూపుతుంది. కిడ్నీలు ఉన్న ప్రాంతంలో ఉదా రేఖల్తో దర్శనమిస్తే వాళ్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నట్లు నిర్థారణ చేసుకోవచ్చు.

ఆకు పచ్చ చాయలో కలిసి ఆరెంజ్ మిశ్రమాన్ని ఎవరు తమ ఆరాల్లో కలిగి ఉంటారో వాళ్ళు ఉత్తి పుణ్యానికి ఎదుటి మనిషితో తగవు పెట్టుకునే సరదా కలిగి ఉంటారు. రంగుల్లోని ప్రాథమిక చాయల్లోని మరో చాయల్ని చూడగలిగే స్థితికి చేరుకున్నప్పుడు ఇలాంటి మనుష్యుల జోలికి వెళ్ళటం మానుకోండి. ఎందుకంటే వీళ్ళకి నలుపు తెలుపు తప్ప మరొకటి అర్థం కాదు. వీళ్ళ బుర్రలు సరిగ్గా ఊహించే స్థితిని పొంది ఉండవు. ఎదుటి మనుష్యులకి ఆలోచనలు, అభిప్రాయాలు, కొంత జ్నానం ఉంటాయని కూడా వీళ్ళు గ్రహించకుండా అంతులేని వాదనా వ్యాసాంగంతో మునిగి తేలుతూ ఉంటారు. వాదనలో పస ఉన్నా లేకున్నా వీళ్ళు గ్రహించలేరు. వాళ్ళ ఏకైక జీవితాసయం నిరంతరం వాదిస్తూ ఉండడమే!

పసుపు;- బంగారు రంగు పసుపు ఆరా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవాడు. గొప్ప మహనీయిలైన సన్యాసులకి ఈ రంగు హేలో లు తలల వెనుక కనిపిస్తూ ఉంటాయి. వారి ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఈ హేలో ప్రకాశం ఎక్కువ అవుతూంటుంది. అత్యుత్తమ స్థానంలో ఉన్న సన్యాసుల ఆరాల్లో మేలిమి బంగారు పసుపు వర్ణంతో బాటు ఇండిగో వర్ణం కూడా కలిసి ఉంటుంది. ఆరాలో పసుపు వర్ణం ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికంగా, నైతికంగా బలంగా ఉంటారు. అలాంటి వారు భయాన్ని త్యజించిన వారై, సక్రమమైన మార్గంలోనే నిరంతరం నడుస్తూంటారు. ప్రకాశవంతమైన పసుపు రంగు ఆరా ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మవచ్చు. పాడవుతున్న వెన్నకు వుండే పసుపు రంగు ఉన్న వ్యక్తిని పిరికివాడుగా గ్రహించవచ్చు. కళావిహీనం అయిన పసుపు రంగుని ధరించిన వ్యక్తి అన్నిటికీ భయపడే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఎరుపు పాలు ఎక్కువైన పసుపు ఆరా కలిగిన వ్యక్తి మానసిక, నైతిక, శారీరక పిరికితనపు బలహీనతలను కల్గి ఉంటాడు. వాళ్ళల్లొ ఆధ్యాత్మికత పూర్తిగా మృగ్యం. వారిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సూన్యంగా ఉంటుంది. ఎరుపు రంగులో కలసిన వారిలో పసుపు ఆరా కల వ్యక్తి మతాల్ని మార్చుకుంటూ స్థిరత్వంతో ఉండలేక “ఐదునిముషాల్లో సాధించగలిగే” విషయాల వెంట, వస్తువుల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. వాళ్ళు నిలకడగా ఉండలేరు. ఏ విషయాన్ని గురించి కానీ కొన్ని క్షణాలకన్నా మించి ధ్యాసతో ఉండలేరు. ఎరుపు – పసుపు, ఇంకా బ్రౌన్ – ఎరుపు చాయలున్న ఆరకల వ్యక్తులు ’విజాతి’ వ్యక్తుల వెంట పడుతూ నిరంతరం భంగపడుతూ ఉంటారు. ఒక గమనించాల్సిన విషయం వినండి. ఓ వ్యక్తికి ఎరుపు లేక అల్లం రంగు జుట్టు ఉంటే అతని ఆరాలో ఎరుపు – పసుపు ఉంటే అతను దురుసుగా ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఎవరు ఏమాట మాట్లాడినా తనలోపాల్ని ఎత్తి చూపి దుయ్యబడుతునారని అపోహలు తెచ్చుకుని అందరితో పోట్లాడుతూ ఉంటాడు. కొన్ని రకాల ఎరుపు పసుపు రంగు మిశ్రమాలు ఆరాలో ఉన్న వ్యక్తి తనను తానే అధముణ్ణని ఊహించుకుని దిగులు పడిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళ ఆరాల్లో ఎరుపు ఎంత ఎక్కువ సాంద్రతతో ఉంటే వాళ్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, అంత తీవ్రతని పొంది ఉంటుంది. బ్రౌనిష్ ఎరుపు రంగు ఆరాలు ఉన్న వ్యక్తుల ఆలోచనలు పవిత్రంగా ఉండవు. వారికి ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుదల ఉండదు. ఇలాంటి అధోగతి పొందిన వాళ్ళందరూ ఒక చోట ప్రోగయి ఉంటారు. ఇలాంటి త్రాగుబోతులూ, భ్రష్టులూ, నీచులంతా అధ:పాతాళానికి కూరుకుపోతూ ఉంటారు. వీళ్ళు మరీ అధ్వానంగా తయారై ఉంటే వీళ్ళ ఆరాల్లో పాచి రంగు కూడా కలసిపోయి అసహ్యంగా ఉంటుంది. స్వయంకృతాపరాధులు వీళ్ళు. వీళ్లని పతనం నుంచి రక్షించడం దాదాపు దుస్సాధ్యం.

బ్రౌనిష్ – పసుపు రంగు అపరిశుద్ద ఆలోచనలని సూచిస్తుంది. ఇలాంటి రంగు ఉన్న ఆరా గలవాళ్ళు ఇరుకైన, సక్రమమైన దారిలో నడవడంలేదని గ్రహించవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆకుపచ్చ – పసుపురంగు కాలేయ జబ్బులను ఎత్తి చూపిస్తుంది. ఆకుపచ్చ-పసుపు, బ్రౌన్ – ఎరుపు – పసుపు రంగుల్లోకి మారుతూ కనిపిస్తే అలాంటి వ్యక్తుల్లో సుఖవ్యాధులున్నాయని అర్థం. సుఖవ్యాధులున్న వ్యక్తుల పిరుదుల చుట్టూ దట్టమైన బ్రౌన్ తో కలసిన దట్టమైన పసుపు పట్టీ ఒకటీ కచ్చితంగా కనిపిస్తుంది. ఈ పట్టీ వద్ద ఎర్రమట్టి విరజిమ్మబడినట్లు కనిపించడం కూడా సహజమే. పసుపు రంగులో బ్రౌన్ రంగు ఎక్కువ ప్రస్ఫుటమవుతూ ఉండి వంకర్లు తిరుగుతూ ఉన్న పట్టీలను కలిగి ఉన్నట్టు కనిపిస్తే అది మానసిక అవలక్షణాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి రెండు విభిన్న మనస్తత్వాలు కలిగి ఉంటే అతని ఆరాలో సగ భాగం నీలి పసుపు రంగు మిగతా సగభాగం బ్రౌన్ లేక ఆకుపచ్చ – ఎరుపు మిశ్రమంతో నిండి ఉంటుంది.

మనం మొదట అనుకున్న శుద్ధ బంగారు వర్ణపు పసుపు రంగు ఆరాను సంపాదించు కోవటానికి మనం నిరంతరం కృషి చేయాలి. ఆలోచనలను ఉద్ధేశ్యాలనూ పవిత్రంగా ఉంచుకోవడం ద్వారా దీన్ని మనం సాధించవచ్చు. జీవబ్రహ్మైక్య పథంలో అభివృద్ధి సాధించాలంటే తప్పకుండా ఈ పసుపు రంగు ఆరాను సంపాదించుకోకుండా మాత్రం ముందుకు వెళ్ళలేం.

ఆకుపచ్చ:- ఆకుపచ్చ రంగు రొగ ఉపశమనానికి, విద్యా బోధనకూ ప్రతీక, భౌతికంగా ఎదుగుదలను కూడా ఆకుపచ్చ రంగు ప్రకటిస్తుంది. గొప్ప వైద్యులూ శాస్త్ర నిపుణులూ తమ ఆరాల నిండా ఆకుపచ్చ రంగుని నింపుకుని కనిపిస్తారు. వాళ్ళ ఆరాల్లో ఎరుపురంగు కూడా అమితంగా కనిపిస్తుంది. ఒక కుతూహలాన్ని రేకెత్తించే విషయం ఏమంటే ఆకుపచ్చ-ఎరుపు రంగులు ఆరాలో పరస్పరం స్నేహంగా కనిపిస్తూ ఒకదానితో మరొకటి సులువుగా కలిసిపోతూ ఉంటాయి. వాటి రెండింటిలో చక్కటి పొంతన కుదురుతుంది. మామూలుగా వస్తువుల్లో ఈ రెండు రంగులూ ఎబ్బెట్టుగా కనిపించవచ్చు. కానీ ఆరాల్లో మాత్రం ఈ రంగులు చూసేవాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి. తగినంత ఎరుపు ఆకుపచ్చ రంగుతో కలిసి ఉన్న శస్త్ర నిపుణులు చాలా చురుకుగా ఉంటారు. తమ విధిని చక్కగా అనుష్టించగలిగి ఉంటారు. ఎరుపు రంగు లేకుండా, ఉట్టి ఆకుపచ్చ రంగునే తమ ఆరాల్లో కలిగిన వైధ్యులు తమ వృత్తిలో అత్యుత్తమ స్థానాన్ని పొంది ఉంటారు. లేక ఆరంగు కలిగిన నర్సులు మానవ సేవా తత్పరతను తమ జీవితాశయంగా కలిగిఉండడమే కాకుండా అంతులేని ప్రేమ శ్రద్ధల్ని కలిగిఉంటారు. ఒక ప్రత్యేక నీలి వర్ణంతో జత కలిసిన ఆకుపచ్చ రంగు చక్కటి విధ్యా భొధనా పటిమను ప్రతిబింబిస్తుంది. కొందరు విద్యావేత్తల ఆరాల్లో ఆకుపచ్చ రంగు పట్టీలు నీలి రంగు సుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. విద్యుత్ కాంతి నీలి రంగు నీలి ఆకుపచ్చ రేఖల మధ్యలో పసుపు రంగులొ ప్రదర్శిస్తూ ఉన్న ఈ ఆరాలు ఉన్న ఉపాధ్యాయులు తమ శిష్యులమీద అపారమైన వాత్సల్యాన్ని కరుణను కలిగి ఉండటమే కాకుండా అత్యున్నతమైన ఆధ్యాత్మిక విషయాలను నిశితంగా స్పష్టంగా శీష్యులకు నేర్పుగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు.

మానవుల, ’ఇతర జీవుల ఆరొగ్యం గురించి శ్రద్ధ వహించే వ్యక్తుల ఆరల్లో ఆకుపచ్చ రంగు విశేషంగా ద్యొతకమవుతుంది. గొప్ప డాక్టర్లు, గొప్ప నర్సులు, గొప్ప సర్జన్లు కాకపోయినా, ఏ వ్యక్తులైనా మానవుల, జంతువుల ఆరోగ్యాన్ని గురించి వాళ్ళు ఏ పని అయిన చేస్తున్నట్లైతే వాళ్ళ ఆరాల్లో కొద్దో గొప్పో ఆకుపచ్చ రంగు చోటుచేసుకుని ఉంటుంది. ఆరోగ్యశాఖను ప్రకటించే బిళ్ళ ల్లోని ఆరాల్లో ఈ రంగు స్పష్టంగా గోచరిస్తుంది. ఆకుపచ్చ రంగు సాధారణంగా మరో గాఢ వర్ణాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆకుపచ్చరంగు ఆరాల్లో ఉన్న వ్యక్తులు స్నేహసీలురుగానూ, సానుభూతిపరులుగానూ, హితులుగానూ ఉంటారు. కానీ పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ రంగు ఉన్న ఆరాలు కల వ్యక్తులను నమ్మడానికి వీలు లేదు. వికారాన్ని సూచించే పసుపు రంగు కానీ, వికారంగా కనిపించే ఆకుపచ్చగానీ ఎంతో అధికంగా ఆరాల్లో కనిపిస్తే అంత గాఢంగా వాళ్ళు మోసగాళ్ళని గ్రహించగలం. తియ్యటి మాటల్తో నమ్మించి మోసాలు చేసి డబ్బులను సంపాదించే వాల్లకు నిమ్మ ఆకుపచ్చ రంగు – పసుపు రంగు మిశ్రమం ఉన్న ఆరా ఉండి తీరుతుంది. ఆకుపచ్చ రంగు క్రమేపీ ఆకాశం నీలం రంగు గానీ విద్యుత్ నీలం రంగు గానీ కలిగి ఉంటే అలాంటి వ్యక్తుల్ని సంపూర్ణంగా నమ్మవచ్చు.

నీలి:- ఆధ్యాత్మిక ప్రపంచానికి నీలి రంగుని సూచికగా వర్ణిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్న బుద్ధి సూక్ష్మతను కూడా ఒక విధమైన నీలి రంగు చాయ ఎత్తి చూపుతుంది. మంచి చాయ ఉన్న నీలి రంగు సానుకూల్యాన్ని గుర్తింపు చేయగలిగి ఉంటుంది. ఎథిరిక్ నీలి రంగు ఛాయనే కలిగి ఉంటుంది. నేరుగా సిగరెట్టు నుండీ వెలువడే లేత నీలి పొగ రంగులో ఆరా ఉంటుంది. ఎండు కట్టెలు మండుతున్నప్పుడు కూడా ఆ మంటల ప్రారంభంలో ఇలాంటీ నీలిరంగు భాగాలను గమనించవచ్చు. ప్రగాఢమౌతున్న నీలి వర్ణం సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం. పాలిపోతున్న ఈ నీలివర్ణపు ఆరా కల వ్యక్తి చంచల మనస్కుడై, స్థిరాభిప్రాయం లేని వాడై, ఎంతోబలవంతం చేస్తే తప్ప ఏ నిర్ణయమూ తీసుకోలేనివాడై ఉంటాడు. బలమైన లేదా గాఢమైన నీలి రంగు ఆర కలిగి ఉంటే ఉన్నత దిశలో క్రమేపి ఎక్కుతూ వున్న వ్యక్తినీ, లేక అభివృద్ధి కోసం నిజంగా పాటుపడే వ్యక్తినీ కృషి చేసే వ్యక్తినీ చూడొచ్చు. చేస్తున్న పనిలో త్రుప్తి పొందుతున్న వ్యక్తి ఆరాల్లొ గాఢమైన నీలివర్ణం దర్శనమిస్తూ ఉంటుంది. ఆత్మ ప్రభోదాన్ని నిజంగా విని ధర్మప్రచారం చేస్తూన్న మతాధికారుల ఆరాలు ఈ వర్ణంతో ఎంతో శోభిస్తూ ఉంటాయి. ప్రపంచం చుట్టూ ధర్మ ప్రచారానికి బయలుదేరి తద్వారా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకో జూస్తున్న మతప్రచారకుల ఆరాల్లో మాత్రం ఈ వర్ణం అసలు గోచరించదు! ఏ వ్యక్తి సచ్చీలాన్నయినా అతని ఆరాలో కనిపిస్తున్న పసుపు రంగుని బట్టి నీలి రంగుని బట్టి మాత్రమే స్పష్టంగా గ్రహించహలం.

ఇండిగో:- ఇండిగో రంగునూ, అతి నీలలోహిత వర్ణాన్నీ కలిపి మనం చర్చించుకోవలసి వస్తుంది. ఎంచేతనంటే ఈ రెండు వర్ణాలు అత్యంత సహజంగా పరస్పరాశ్రితాలు. ఆరాలో అధికభాగం ఇండిగో వర్ణంలో కనిపిస్తే అలాంటి వ్యక్తులు మతాన్ని గాఢంగా విశ్వసించేవాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు గొప్ప మతాభిమానులమని ప్రచారం చేసుకోనక్కరలేదు. కొంతమంది తమకి మతం మీద బోలెడంత విశ్వాసం ఉందని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది తమకి మతం మీద ప్రగాఢమైన విశ్వాసం ఉందని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ ఇద్దరిలో ఎవరు నిజంగా మత విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళో వాళ్ళ ఆరాలను పరీక్ష చేయకుండా నిర్ధరణ చెయ్యలేం. ఆరాలోని ఇండిగో వర్ణం మతవిశ్వాసాన్ని స్పష్టంగా నిరూపిస్తుంది. ఈ ఇండీగో వర్ణంతో పాటు పింక్ వర్ణం కూడా ఆరాల్లో కనిపిస్తే అలాంటి వ్యక్తులు ప్రతి విషయనికి విసుక్కునే వాళ్ళుగా గ్రహించండి. మనిషిలోని అధోగతిని ఈ పింక్ – ఇండిగో మిశ్రమం సూచిస్తుంది. నిర్మలత్త్వం లోపించిన వ్యక్తుల ఆరాల్లో ఈ వర్ణం ప్రత్యక్ష మవుతూ వుంటుంది. హృద్రోగంతో బాధపడుతున్న రోగులలో, జీర్ణకోశ జబ్బుల్తో బాధపడుతున్న రోగులలో ఇలాంటి మిశ్రమం వున్న రంగు ఆరాల్లో తప్పక నెత్తి మీద గూడు కట్టుకుని ఉంటాయి.

గ్రే (ఉదా):- ఈ రంగు ప్రత్యేకించి ఏ గుణాన్ని సూచించదు. బొత్తిగా అధోగతి పాలైన వ్యక్తిని ఈ వర్ణం విశ్లేషిస్తుంది. ఆరాల్లో ఈ రంగు పొరలు ద్యోతకమయితే ఆ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నడనీ, వెంటనే అతనికి వైద్య సహాయం అవసరమనీ గ్రహించాలి. తలనొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉంటే అతని ఆరాలో ఆ రంగు కొట్టుకుంటూ కనిపిస్తుంది. బొత్తిగా ఎదుగుదల లేని వ్యక్తి ఆరాలో ఈ రంగు చెల్ల చెదురుగా విరజిమ్మినట్లు కనిపిస్తుంది. అయితే అలాంటి వ్యక్తుల నగ్న శరీరాల్ని చూసే అవకాశం సాధారణంగా మీకు రాకపోవచ్చు.——లోబ్ సాంగ్ రాంపా,టిబెట్ యోగి

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page